Maruti Brezza vs Tata Nexon: భారత మార్కెట్‌లో 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల విభాగానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ రెండూ అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లుగా నిలిచాయి. ఇటీవల 2026 మారుతి బ్రెజ్జా మిడ్-లైఫ్ అప్‌డేట్‌తో కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందింది. మరొకవైపు టాటా నెక్సాన్ కూడా విస్తృతమైన ఫీచర్లు, పవర్‌ఫుల్ డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లతో గట్టి పోటీనిస్తోంది. ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు సరిపోతుందో వివరంగా తెలుసుకుందాం.

ధరలు, బడ్జెట్ పోలిక

ధరల విషయానికి వస్తే 2026 మారుతి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.7.40 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ.13.55 లక్షల వరకు ఉంది. టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.37 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ.14.22 లక్షల వరకు లభిస్తుంది. ప్రారంభ ధరలు రెండింటికీ దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, బ్రెజ్జాలో అత్యంత తక్కువ ధరకే టర్బో పెట్రోల్ ఆప్షన్ లభిస్తుంది. అంతేకాకుండా బ్రెజ్జా టాప్ వేరియంట్ ధర, నెక్సాన్ టాప్ వేరియంట్ కంటే దాదాపు రూ.లక్ష వరకు తక్కువగా ఉంటుంది.

డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు

డిజైన్ పరంగా 2026 బ్రెజ్జా సరికొత్త రెడ్ ఎలిమెంట్లతో మరింత స్పోర్టీగా రూపుదిద్దుకోగా, టాటా నెక్సాన్ మోడర్న్ కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తో బోల్డ్ లుక్‌ను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా నెక్సాన్ కాస్త పైచేయి సాధిస్తుంది. ఇందులో 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. బ్రెజ్జాలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 4-అంగుళాల MID, వైర్‌లెస్ ఛార్జింగ్, అంబియంట్ లైటింగ్ వంటి అవసరమైన అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్, గేర్‌బాక్స్, పర్ఫార్మెన్స్:

నెక్సాన్‌లో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120PS), 1.2-లీటర్ సీఎన్‌జీ (100PS), 1.5-లీటర్ డీజిల్, ఎలక్ట్రిక్ (EV) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు బ్రెజ్జాలో 1.5-లీటర్ పెట్రోల్ (103PS), 1.5-లీటర్ సీఎన్‌జీ (88PS), కొత్త 1.0-లీటర్ టర్బో పెట్రోల్ (110PS) ఇంజిన్లు లభిస్తాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా నెక్సాన్‌లో 5-స్పీడ్, 6-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ, 7-స్పీడ్ డీసీఏ గేర్‌బాక్స్‌లు ఉండగా, బ్రెజ్జాలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి.

ఏది ఎంచుకుంటే మంచిది?

తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన సర్వీస్, మెరుగైన టర్బో పెట్రోల్ మాన్యువల్ పర్ఫార్మెన్స్, మంచి రీసేల్ వ్యాల్యూ కావాలనుకునే వారికి 2026 మారుతి బ్రెజ్జా బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా ఎక్కువ ఫీచర్లు, ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్, డీజిల్ లేదా విస్తృతమైన డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లు కావాలో అనుకునే వారికి టాటా నెక్సాన్ సరిగ్గా సరిపోతుంది.

Tags: