Suzuki Jimny : సుజుకి జిమ్నీకి పెద్ద అప్‌గ్రేడ్.. సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు అడ్వాన్స్ అయ్యాయి.. అవేంటంటే ?
సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు అడ్వాన్స్ అయ్యాయి.. అవేంటంటే ?
Suzuki Jimny : సుజుకి జిమ్నీ మొట్టమొదటగా 1970లో LJ10 మోడల్‌తో పరిచయం చేసింది. ఇది 359 సీసీ టూ-స్ట్రోక్ ఇంజన్‌తో కూడిన చిన్న, తేలికపాటి 4x4 ఆఫ్-రోడర్. జపాన్‌లో మొట్టమొదటి భారీ స్థాయిలో ఉత్పత్తి అయిన మినీ ఆఫ్-రోడర్‌గా ఇది గుర్తింపు పొందింది. 1981లో SJ సిరీస్‌తో దీని స్థానంలో 1.0-లీటర్ ఇంజన్ వచ్చింది, దీనిని ప్రపంచవ్యాప్తంగా సుజుకి సమురాయ్ అని పిలిచేవారు. 2023లో 5-డోర్ల వేరియంట్ లాంచ్ అయిన తర్వాత, ఇప్పుడు జిమ్నీకి 2026 మోడల్‌లో పెద్ద అప్‌గ్రేడ్ లభించనుంది.
జిమ్నీ కాంపాక్ట్ లుక్, పవర్ఫుల్ ఆఫ్-రోడ్ పర్ఫామెన్స్ దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజాదరణ తెచ్చిపెట్టింది. 1998లో సుజుకి మూడవ తరం జిమ్నీని కొత్త డిజైన్, కాయిల్-స్ప్రింగ్ సస్పెన్షన్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో విడుదల చేసింది. ఫోర్త్ జనరేషన్ జిమ్నీ 2018లో రెట్రో-ప్రేరేపిత, బాక్సీ డిజైన్, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. ఆ తర్వాత, 5-డోర్ల వేరియంట్ 2023లో లాంచ్ అయ్యింది.
సుజుకి ఎప్పుడూ ట్రెండీగా ఉండే జిమ్నీకి జపాన్‌లో కొన్ని తేలికపాటి అప్‌డేట్‌లు వచ్చాయి. ఈ అప్‌డేట్‌లు కేవలం మూడు డోర్ల మోడల్‌కు మాత్రమే లభించాయి. బయటి వైపున, సుజుకి డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. జిమ్నీ బాక్సీ షేప్, దాని సింపుల్, పాతకాలపు శైలితో ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. రెగ్యులర్,నారో-బాడీ వేరియంట్‌లు రెండూ తమ లుక్‌ను అలాగే నిలుపుకున్నాయి. బ్లైండ్ స్పాట్‌లను తగ్గించడంలో సహాయపడటానికి, రెగ్యులర్ అద్దం కింద చిన్న సబ్-మిర్రర్‌ల కాంబోను కూడా ఇందులో అమర్చారు.
అప్‌డేట్ చేయబడిన ఈ ఆఫ్-రోడ్ మెషిన్‌లో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు డయల్స్ మధ్య కొత్త 4.2-అంగుళాల కలర్ డిస్‌ప్లే ఇవ్వబడింది. హై ట్రిమ్స్‌లో పాత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్థానంలో, మెరుగైన కనెక్టివిటీని అందించే కొత్త 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను అందించారు. అయితే తక్కువ వేరియంట్‌లలో మాత్రం ప్లాస్టిక్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ అలాగే కొనసాగుతుంది.
సేఫ్టీ పరంగా జిమ్నీ ఇప్పుడు డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్ II, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, ఆటోమేటిక్ హై బీమ్, రోడ్ సైన్ రికగ్నిషన్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లలో ఎడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ , రియర్ ఫాల్స్ స్టార్ట్ ప్రివెన్షన్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. ఈ అప్‌డేట్‌లతో సుజుకి జిమ్నీ పాతకాలపు ఆకర్షణను అలాగే ఉంచుతూ, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్ల సౌకర్యాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది.