Triumph Tiger 1200: అడ్వెంచర్ బైక్స్ విభాగంలో తిరుగులేని గుర్తింపు ఉన్న ట్రయంఫ్ టైగర్ 1200 మోడల్‌ను కంపెనీ సరికొత్తగా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 1,200 సీసీ టి-ప్లేన్ త్రిపుల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 9,250 ఆర్‌పీఎమ్ వద్ద ఏకంగా 158 పీఎస్‌ పవర్ విడుదల చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఏకంగా 8 పీఎస్‌ పవర్ పెరగడం విశేషం. ఈ బైక్ ఇంజిన్ పనితీరు మెరుగుపరచడానికి సిలిండర్ హెడ్, పిస్టన్లు, వాల్వ్‌లు, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కంపెనీ పూర్తిగా పునరుద్ధరించింది. గియర్ బాక్స్, షాఫ్ట్ డ్రైవ్ కూడా మరింత స్మూత్‌గా మారాయి.

ట్రాఫిక్‌లోనూ సులువుగా కంట్రోల్

సాధారణంగా పెద్ద బైక్‌లను తక్కువ స్పీడ్‌లో నడపడం కాస్త కష్టంగా ఉంటుంది. అయితే ఈ బైక్‌లో క్రాలింగ్ స్పీడ్‌ను దాదాపు 6 కిలోమీటర్లు తగ్గించారు. దీనివల్ల నగరాల్లో ట్రాఫిక్ ఉన్నప్పుడు, ఇరుకైన రోడ్లపై నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు రైడర్‌కి పూర్తి నియంత్రణ లభిస్తుంది. బైక్ బరువు, పవర్‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకునేలా డిజైన్ చేశారు. లాంగ్ రైడ్స్ వెళ్లేవారు నగరాలు దాటేటప్పుడు ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను ఈ అప్‌డేట్ సులువుగా పరిష్కరిస్తుంది.

అడ్వాన్స్డ్ సస్పెన్షన్

ఈ మోడల్‌లో షోవా ఈఆర్‌ఏ హైట్‌ఫ్లెక్స్ సెమీ యాక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ ఇచ్చారు. రైడర్లు రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ఫర్మ్, మీడియం, సాఫ్ట్ అనే మూడు మోడ్స్‌ ఎంచుకోవచ్చు. బైక్ ఆగినప్పుడు సీట్ ఎత్తు స్వయంచాలకంగా 30 మిల్లీమీటర్లు తగ్గే ఆటోమేటిక్ రైడ్-హైట్ ఫీచర్ ఇందులో ప్రధాన ఆకర్షణ. ఆప్షనల్ లో-సీట్‌ ఎంచుకుంటే ఆగినప్పుడు సీటు ఎత్తు 790 మిల్లీమీటర్లకు చేరుకుంటుంది. దీంతో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కూడా బైక్‌ను చాలా హ్యాపీగా నడపవచ్చు. బైక్‌ను సెంటర్ స్టాండ్‌పై ఉంచడాన్ని సులభతరం చేసే సెంటర్ స్టాండ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది.

రాడార్ సేఫ్టీ టెక్నాలజీ

సేఫ్టీ విషయంలో ట్రయంఫ్ సరికొత్త రడార్ టెక్నాలజీ పరిచయం చేసింది. బోష్ కంపెనీకి చెందిన ముందు, వెనుక రడార్ వ్యవస్థల ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ముందు భాగంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే హెచ్చరించే అలర్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు లభిస్తాయి. 7 ఇంచుల హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ద్వారా వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయం పొందే వెసులుబాటు ఉంది. మొబైల్ చల్లగా ఉంచే కూలింగ్ కంపార్ట్‌మెంట్, యూఎస్‌బీ-సి ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

ఈ కొత్త మోడల్‌ను జీటీ ప్రో, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్ అనే రెండు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. జీటీ ప్రో వెర్షన్‌లో 20 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉండగా, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్‌లో సుదీర్ఘ ప్రయాణాల కోసం 30 లీటర్ల పెద్ద ట్యాంక్ అందించారు. ముందు 19 ఇంచులు, వెనుక 17 ఇంచుల చక్రాలు ఉంటాయి. హెడ్ లైట్లలో కార్నరింగ్ లైటింగ్, హీటెడ్ సీట్లు, హీటెడ్ గ్రిప్స్ లభిస్తాయి. భారత్‌లోకి ఈ బైక్ మార్చి 2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags: