Innova Hycross: భారత మార్కెట్లో 2022 ముగింపులో ప్రవేశపెట్టిన టయోటా ఇన్నోవా హైక్రోస్ నాలుగేళ్ల తర్వాత ముస్తాబవుతోంది. నవంబర్ 26న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అధికారికంగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మార్కెట్లో మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎక్స్‌టీరియర్ డిజైన్ నుంచి ఇంటీరియర్ టెక్నాలజీ వరకు భారీ మార్పులు చేశారు. భారతదేశంలో ఉన్న కుటుంబాలకు అత్యంత నమ్మకమైన వాహనంగా పేరుగాంచిన ఇన్నోవా, ఈ నూతన అప్‌డేట్‌తో మరింత ఆకర్షణీయంగా మారనుంది.

కారు ముందు భాగంలో ఊహించని మార్పులు ఉండబోతున్నాయి. టయోటా హైలక్స్ వాహనాన్ని పోలిన పెద్దదిగా ఉండే చతురస్రాకార ఫ్రంట్ గ్రిల్‌ను ఇందులో అమర్చబోతున్నారు. నూతన డిజైన్‌తో కూడిన ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, డైనమిక్ టర్న్ ఇండికేటర్లు కారుకి రాయల్ లుక్ ఇస్తాయి. వేరియంట్లను బట్టి 18 ఇంచుల అలాయ్ వీల్స్‌తో పాటు వెనుక భాగంలో కూడా టెయిల్ లైట్ల స్టైలింగ్ కాస్త మారనుంది. కారు పాత బాడీ షేప్‌ను అలాగే ఉంచుతూ కేవలం ఫ్రంట్, రియర్ ప్రొఫైల్‌ను మరింత అగ్రెసివ్‌గా తీర్చిదిద్దారు.

పాత మోడల్‌లో లభించిన 10.1 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్థానంలో, ఇప్పుడు 12.3 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయాలకు సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్ కోసం ప్రత్యేకంగా 12.3 ఇంచుల డిజిటల్ కన్సోల్ రానుంది. పెట్రోల్ మోడళ్లలో 7 ఇంచుల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అందుబాటులో ఉంటుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), కనెక్టెడ్ కార్ ఫీచర్లను మరింత పటిష్టం చేశారు.

ఈ కారులో అత్యంత ఆసక్తికరమైన అంశం E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ ఇంజిన్. సాధరణ పెట్రోల్ కంటే లీటరుకు దాదాపు రూ.20 తక్కువ ధరకు లభించే E85 ఇంధనంతో ఈ ఇంజిన్ పనిచేస్తుంది. మునుపటి 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 171 బిహెచ్‌పి పవర్‌ను, 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ 181 బిహెచ్‌పి పవర్‌ను అందిస్తాయి. హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత తోడైతే రన్నింగ్ కాస్ట్ మరింత తగ్గుతుంది.

కొత్త ఇన్నోవా హైక్రోస్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.20 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ధరల వద్ద ఇది ప్రత్యర్థి కార్లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, సెల్ఫ్ డ్రైవ్ చేసే వారికి, లాంగ్ ట్రావెలర్లకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. అధికారిక విడుదల సమయంలో ధరలు, డెలివరీ తేదీలు స్పష్టమవుతాయి. లగ్జరీ, మైలేజ్, నమ్మకం కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Tags: