Indian Automobile Industry : సామాన్యుడి సైకిల్ నుంచి వరల్డ్ క్లాస్ కార్ల దాకా..ఆటోమొబైల్ రంగంలో మనదే హవా

ఆటోమొబైల్ రంగంలో మనదే హవా

Update: 2026-01-30 11:41 GMT

 Indian Automobile Industry : ఇరవై ఒకటవ శతాబ్దం మొదలై పాతికేళ్లు గడుస్తోంది. ఈ పాతికేళ్ల కాలంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం సాధించిన ప్రగతి అమోఘం. ఒకప్పుడు విదేశీ కార్లను చూసి మురిసిపోయిన మనం, ఇప్పుడు ప్రపంచానికే కార్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. మేక్ ఇన్ ఇండియా నినాదంతో మొదలైన ఈ ప్రస్థానం నేడు భారత్‌ను గ్లోబల్ ఆటోమొబైల్ లీడర్‌గా నిలబెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ రంగం ఎలా మారిందో ఓసారి పరిశీలిద్దాం.

నిజానికి 2000 సంవత్సరానికి ముందు భారత ఆటోమొబైల్ రంగం చాలా పరిమితంగా ఉండేది. కానీ 1991 ఆర్థిక సంస్కరణల ఫలితాలు 21వ శతాబ్దం ప్రారంభంలో స్పష్టంగా కనిపించడం మొదలయ్యాయి. హ్యుందాయ్, హోండా వంటి విదేశీ కంపెనీలు భారత్‌లోకి అడుగుపెట్టడంతో పోటీ పెరిగింది. అప్పటి వరకు మొనాపాలిగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది. మన దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా కూడా తమ వ్యూహాలను మార్చుకుని అంతర్జాతీయ స్థాయి కార్లను తయారు చేయడం ప్రారంభించాయి. ఫలితంగా కస్టమర్లకు తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు ఉన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం భారతదేశంలో 30కి పైగా దిగ్గజ కార్ కంపెనీలు తమ వ్యాపారాలను సాగిస్తున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, టయోటా వంటి బ్రాండ్లు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ చేరువయ్యాయి. మెర్సిడెస్ బెంచ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల తయారీ కూడా ఇప్పుడు భారత్‌లోనే జరుగుతోంది. ఫోర్డ్, చెవర్లే వంటి కొన్ని కంపెనీలు వెనుదిరిగినప్పటికీ, దేశీయ మార్కెట్ మాత్రం మరింత బలోపేతం కావడం విశేషం. ప్రతి సంవత్సరం లక్షలాది కొత్త కార్లు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నాయి.

టూ-వీలర్ రంగంలో అయితే భారత్‌కు ఎదురే లేదు. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్ మనదే. 2000 సంవత్సరంలో ఏడాదికి కొన్ని లక్షల వాహనాలు మాత్రమే తయారయ్యేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య కోట్లకు చేరింది. ముఖ్యంగా గత ఐదేళ్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల హవా పెరిగింది. ఓలా, ఏథర్ వంటి స్టార్టప్‌లు ఈ రంగంలో విప్లవం సృష్టించాయి. ఇప్పుడు భారత్ కేవలం తన అవసరాలకే కాకుండా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాలకు భారీగా వాహనాలను ఎగుమతి చేస్తూ 'ఎగుమతుల హబ్'గా అవతరించింది.

దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో ఆటోమొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మన దేశ జీడీపీలో ఈ రంగం వాటా సుమారు 7 శాతంగా ఉంది. తయారీ రంగంలో అయితే ఇది ఏకంగా 40 శాతం వాటాను కలిగి ఉంది. సుమారు 3 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీలో కూడా ఆటో సెక్టార్ నుంచి వచ్చే ఆదాయమే అత్యధికం. రాబోయే పదేళ్లలో ప్రపంచంలోనే నంబర్-1 ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా భారత్ అవతరిస్తుందని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News