Maruti Dzire : లీటరుకు 33కిమీ మైలేజీ..రూ.6.25 లక్షల ధర..ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్ సృష్టించిన సెడాన్

ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్ సృష్టించిన సెడాన్

Update: 2026-01-30 12:50 GMT

Maruti Dzire : మారుతి సుజుకి డిజైర్ భారత ఆటోమొబైల్ మార్కెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించింది. 2025 క్యాలెండర్ ఇయర్‌లో సుమారు 2.14 లక్షల యూనిట్ల విక్రయాలతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా ఇది నిలిచింది. హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ వంటి దిగ్గజ ఎస్‌యూవీలను వెనక్కి నెట్టి మరీ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విజయం కేవలం దేశీయ మార్కెట్కే పరిమితం కాలేదు. గత ఏడాది డిసెంబర్ (2025)లో ఏకంగా 3,489 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కేవలం 564 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఇప్పుడు ఏకంగా 518% వార్షిక వృద్ధిని నమోదు చేసింది.

వినియోగదారులు ఈ కారును ఇంతలా ఇష్టపడటానికి ప్రధాన కారణం దాని ఇంధన సామర్థ్యం. కొత్త డిజైర్ పెట్రోల్ మోడల్ లీటరుకు సుమారు 25 కి.మీ మైలేజీని ఇస్తుండగా, దీని సీఎన్జీ వేరియంట్ ఏకంగా 33.73 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కేవలం సీఎన్జీ మోడల్సే 89,015 యూనిట్లు అమ్ముడయ్యాయంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. తక్కువ నిర్వహణ ఖర్చు, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ ఈ కారును సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు, అలాగే ట్యాక్సీ ఆపరేటర్లకు మొదటి ఎంపికగా మార్చాయి.

డిజైన్ పరంగా కూడా కొత్త తరం డిజైర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్, హారిజాంటల్ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, మరియు వైడ్ గ్రిల్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. లోపల బీజ్, బ్లాక్ థీమ్ ఇంటీరియర్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు విలాసవంతమైన అనుభూతిని ఇస్తాయి. సేఫ్టీ విషయంలో కూడా మారుతి రాజీ పడలేదు. ఈ కారుకు గ్లోబల్ ఎన్‌క్యాప్‎లో 5-స్టార్ రేటింగ్ రావడం, 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించడం కస్టమర్లలో నమ్మకాన్ని పెంచింది.

ధర విషయానికి వస్తే, కొత్త మారుతి డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.25 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ.9.31 లక్షల వరకు ఉంది. ఎల్‌ఎక్స్‌ఐ (LXi), విఎక్స్‌ఐ (VXi), జెడ్‌ఎక్స్‌ఐ (ZXi), జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ (ZXi Plus) అనే నాలుగు వేరియంట్లలో ఇది లభిస్తోంది. హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్ల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, డిజైర్ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. విదేశాల్లో కూడా మేడ్ ఇన్ ఇండియా కార్లకు ఆదరణ పెరుగుతుండటంతో, రాబోయే రోజుల్లో డిజైర్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం.

Tags:    

Similar News