Bharat Taxi : ఓలా, ఉబెర్లకు చెక్..భారత్ ట్యాక్సీ‎తో డ్రైవర్లే యజమానులు..అమిత్ షా మాస్టర్ ప్లాన్

అమిత్ షా మాస్టర్ ప్లాన్

Update: 2026-02-24 07:25 GMT

Bharat Taxi : దేశవ్యాప్తంగా ట్యాక్సీ డ్రైవర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబెర్ వంటి ప్రైవేట్ సంస్థలకు దీటుగా, సహకార నమూనాలో భారత్ ట్యాక్సీ అనే కొత్త యాప్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సంస్థలో పని చేసే డ్రైవర్లను కేవలం సేవకులుగా కాకుండా సారథులు అని పిలుస్తూ, వారే ఈ సంస్థకు అసలైన యజమానులని అమిత్ షా ప్రకటించారు. ప్రైవేట్ కంపెనీలు కేవలం యజమానులను కోటీశ్వరులను చేయడానికి పనిచేస్తే, భారత్ ట్యాక్సీ మాత్రం డ్రైవర్లను ధనికులను చేయడం కోసమే పుట్టిందని ఆయన స్పష్టం చేశారు.

కేవలం 500 రూపాయల పెట్టుబడితో ఏ డ్రైవర్ అయినా ఈ సహకార సంస్థలో భాగస్వామి కావచ్చు. ఈ నామమాత్రపు రుసుము చెల్లించడం ద్వారా ప్రతి సారథికి సంస్థ నిర్ణయాల్లో ఓటు వేసే హక్కు, లాభాల్లో వాటా లభిస్తుంది. సాధారణంగా గిగ్ ఎకానమీలో డ్రైవర్లకు ఎలాంటి హక్కులు ఉండవు, కానీ ఇక్కడ వారు యజమానుల హోదాలో ఉంటారు. లాభాల పంపిణీ విషయంలో అమిత్ షా ఒక స్పష్టమైన 80-20 మోడల్‌ను వివరించారు. సంస్థకు వచ్చే మొత్తం ఆదాయంలో 80 శాతం నేరుగా డ్రైవర్లకు అందుతుంది, మిగిలిన 20 శాతం కంపెనీ నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తారు. అంటే, రోజువారీ కిరాయిలతో పాటు ఏటా వచ్చే లాభాల్లో కూడా డ్రైవర్లకు వాటా దక్కుతుంది.

వినియోగదారులకు కూడా భారత్ ట్యాక్సీ ఒక వరంలా మారబోతోంది. ఇందులో ప్రైవేట్ కంపెనీల్లా సర్జ్ ప్రైసింగ్(డిమాండ్ పెరిగినప్పుడు ధరలు పెంచడం) ఉండదు. ప్రయాణికులకు తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే దీని లక్ష్యం. ప్రతి గంట బుకింగ్‌లో మొదటి 10 కిలోమీటర్ల ప్రయాణం కలిసి ఉంటుంది. ఆ పైన ప్రయాణించే ప్రతి కిలోమీటర్ కు 19 రూపాయలు, అదనపు సమయానికి నిమిషానికి 2.50 రూపాయలు వసూలు చేస్తారు. టోల్, పార్కింగ్ వంటి ఖర్చులు నేరుగా డ్రైవర్‌కే అందుతాయి. ఈ పారదర్శకమైన విధానం వల్ల అటు ప్రయాణికులకు, ఇటు డ్రైవర్లకు ఇద్దరికీ లాభం కలుగుతుంది.

కేవలం యాప్ అందించడమే కాకుండా, సారథులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. కొత్త కారు కొనుక్కోవడానికి తక్కువ వడ్డీకే రుణాలు, బీమా సౌకర్యం, యాప్ ద్వారా నిరంతర సాయం అందించే సపోర్ట్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఢిల్లీ-NCR, గుజరాత్‌లో ఈ సేవలు విజయవంతంగా నడుస్తున్నాయి. కొందరు డ్రైవర్లు నెలకు 20 వేల రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నట్లు అమిత్ షాతో పంచుకున్నారు. రాబోయే మూడేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం ఓలా, ఉబెర్ వంటి కంపెనీలు డ్రైవర్ల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నాయి. కానీ భారత్ ట్యాక్సీలో డ్రైవర్లే యజమానులు కాబట్టి వారు ఎలాంటి కమీషన్ కట్టాల్సిన పనిలేదు. కేవలం యాప్ నిర్వహణ కోసం రోజుకు 30 రూపాయల నామమాత్రపు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మొదటి మూడేళ్లు కాస్త ఓపిక పడితే, సంస్థ నిలదొక్కుకున్నాక లాభాల వాటా రూపంలో డ్రైవర్ల జీవితాలు పూర్తిగా మారిపోతాయని అమిత్ షా భరోసా ఇచ్చారు. ఈ సహకార నమూనా భారత రవాణా రంగంలో ఒక కొత్త విప్లవానికి నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News