Ather Energy : ఏథర్ నుంచి బడ్జెట్ ధమాకా.. కేవలం రూ.లక్షకే ఓలా, టీవీఎస్‌లకు గట్టి పోటీ ఇచ్చే స్కూటర్
టీవీఎస్‌లకు గట్టి పోటీ ఇచ్చే స్కూటర్
Ather Energy : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో ప్రముఖ తయారీ సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ తన సరికొత్త EL 01 ప్లాట్‌ఫారమ్ ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా ఇటీవల అసెంబ్లీ లైన్‌కు సంబంధించిన మొదటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ కొత్త స్కూటర్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. రాబోయే ఆగస్ట్ 29న ఈ స్కూటర్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునేలా దీనిని అత్యంత సరసమైన ధరకే ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది.
మొదటిసారిగా మెటల్ బాడీ
ఏథర్ ఇప్పటివరకు తీసుకొచ్చిన మోడల్స్ అన్నింటిలోనూ ఫైబర్/పాలిమర్ బాడీ ప్యానెల్స్‌ను ఉపయోగించింది. అయితే ఈ నూతన 'EL 01' స్కూటర్‌లో మొదటిసారిగా దృఢమైన మెటల్ బాడీ ప్యానెల్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హెండ్‌బార్‌పై అమర్చిన హెడ్‌లైట్ సెటప్, ఫ్రంట్ ఆప్రాన్‌పై వెడల్పాటి ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ దీని ప్రత్యేకత. గత ఏడాది ఏథర్ పేటెంట్ దాఖలు చేసిన డిజైన్‌కు ఇది చాలా దగ్గరగా ఉండటం విశేషం.
అధునాతన ఈఎల్ ప్లాట్‌ఫారమ్ ఆధిపత్యం
కంపెనీ గతంలో నిర్వహించిన కమ్యూనిటీ డే ఈవెంట్‌లో ఈ సరికొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్ విశేషాలను వెల్లడించింది. దాదాపు 26 లక్షల కిలోమీటర్ల మేర సేకరించిన రోడ్డు రైడింగ్ డేటా ఆధారంగా దీనిని డెవలప్ చేశారు. ఇది మోడ్యులర్ ప్లాట్‌ఫారమ్ కావడం వల్ల 2 kWh నుంచి 5 kWh వరకు ఉండే విభిన్న సైజుల బ్యాటరీ ప్యాక్‌లను, సైలెంట్ గేర్ డ్రైవ్ మోటార్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త స్కూటర్‌లో ఏ పరిమాణంలో ఉన్న బ్యాటరీ ఇస్తారనేది లాంచ్ రోజున స్పష్టం కానుంది.
ధర ఎంత ఉండవచ్చు?
నివేదికల ప్రకారం.. ఈ కొత్త స్కూటర్ అంచనా ఎక్స్-షోరూమ్ ధర రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే, ఏథర్ నుంచి వస్తున్న అత్యంత చవకైన మోడల్‌గా ఇది నిలుస్తుంది. ప్రస్తుతం ఏథర్ లాంచ్ చేసిన రిజ్టా ప్రారంభ ధర రూ. 1.21 లక్షలు కాగా, 450 సిరీస్ స్కూటర్ల ధర రూ. 1.28 లక్షలుగా ఉంది. తక్కువ ధరలో రావడంతో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో భారీ విప్లవాన్ని తెచ్చి టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1 సిరీస్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఆగస్ట్ 29 ఈవెంట్‌లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు
ఈ లాంచ్ ఈవెంట్‌లో కేవలం ఈ ఒక్క స్కూటర్ మాత్రమే కాకుండా, ఏథర్ నుంచి మరిన్ని కొత్త ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన పెద్ద ప్రకటనలు కూడా ఉండవచ్చని సీఈఓ తరుణ్ మెహతా సంకేతాలు ఇచ్చారు. రేంజ్, బ్యాటరీ కెపాసిటీ, అసలైన ధరల వివరాలు అధికారిక లాంచ్ రోజున వెల్లడి కానున్నాయి.