Bajaj Chetak: దిగ్గజ బైక్‌లను వెనక్కి నెట్టిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆగస్టులో రికార్డ్ విక్రయాలు
ఆగస్టులో రికార్డ్ విక్రయాలు
Bajaj Chetak: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో బజాజ్ ఆటో సంస్థకు చెందిన మోడల్ వారీగా విక్రయాల గణాంకాలు విడుదలయ్యాయి. ఈసారి అమ్మకాల రేసులో ఎవరికీ అందని విధంగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన విజయం సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఆగస్టులో కేవలం 14,014 యూనిట్లు మాత్రమే అమ్ముడుకాగా, ఈ ఏడాది ఆగస్టు నెలలో ఏకంగా 273 శాతం భారీ వార్షిక వృద్ధితో మొత్తం 52,248 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి సంచలనం సృష్టించింది. తద్వారా మార్కెట్లో ఉన్న పలు ప్రముఖ పెట్రోల్ మోడళ్లను సైతం ఇది వెనక్కి నెట్టింది.
బజాజ్ సంస్థ నుంచి వస్తున్న ఇతర ప్రముఖ మోడళ్ల విషయానికి వస్తే, అమ్మకాల జాబితాలో రెండవ స్థానంలో బజాజ్ పల్సర్ 125cc నిలిచింది. పల్సర్ 125 మోడల్ 17 శాతం క్షీణతతో మొత్తం 48,935 యూనిట్ల విక్రయాలను సాధించింది. అలాగే మూడవ స్థానంలో నిలిచిన బజాజ్ ప్లాటినా 31 శాతం తగ్గుదలతో 26,997 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక నాల్గవ స్థానంలో నిలిచిన పల్సర్ 160 + 200 NS మోడల్ 6 శాతం వద్ధితో 24,173 యూనిట్ల బైక్‌లను అమ్ముడుచేసి తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
ఈ విక్రయాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచిన బజాజ్ పల్సర్ 150 బైక్ 15,840 యూనిట్లు అమ్ముడవ్వగా, పల్సర్ 220cc బైక్ 20 శాతం వద్ధితో 7,179 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇక ట్రయంఫ్ 350 మోడల్ 4,723 యూనిట్లు అమ్ముడుకాగా, కేటీఎం డ్యూక్ 250cc బైక్ ఏకంగా 117 శాతం భారీ వృద్ధితో 4,471 యూనిట్ల అమ్మకాలను సాధించి కస్టమర్లను ఆకట్టుకుంది. అదేవిధంగా కేటీఎం డ్యూక్ 200, అవేంజర్ 220 వంటి ఇతర మోడళ్లు కూడా విభిన్న స్థాయిలలో విక్రయాలను నమోదు చేశాయి.
ప్రపంచపు తొలి సీఎన్‌జీ బైక్‌గా పేరుగాంచిన బజాజ్ ఫ్రీడమ్ మోడల్ ఈసారి 41 శాతం క్షీణతతో మొత్తం 1,095 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. అలాగే కేటీఎం 390, ట్రయంఫ్ 400 వంటి మోడళ్లు కూడా మార్కెట్లో తమ ఉనికిని చాటుకున్నాయి. ఏదేమైనప్పటికీ, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం ఊహించని రీతిలో ఏకంగా 52 వేలకు పైగా యూనిట్లు అమ్ముడై ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు.