Bajaj Pulsar NS400Z : భారత్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ధర.. అయినా స్పెయిన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న పల్సర్
అయినా స్పెయిన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న పల్సర్
Bajaj Pulsar NS400Z : భారతదేశపు దిగ్గజ టూ-వీలర్ కంపెనీ బజాజ్ ఆటో తన పవర్‌ఫుల్ బైక్ పల్సర్ NS400Zతో అంతర్జాతీయ మార్కెట్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. తాజాగా ఈ బైక్‌ను స్పెయిన్‌లో విడుదల చేసింది. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన పల్సర్ సిరీస్, ఇప్పుడు విదేశీ వీధుల్లో కూడా తన ఇంజన్ గర్జన వినిపించబోతోంది. అటు స్పెయిన్ మార్కెట్ విశేషాలతో పాటు, ఇటు ఇండియాలో బజాజ్ ప్లాన్ చేస్తున్న భారీ స్కెచ్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
స్పెయిన్ మార్కెట్లోకి పల్సర్ ఎంట్రీ
బజాజ్ ఆటో తన ఫ్లాగ్‌షిప్ మోడల్ పల్సర్ NS400Zను స్పెయిన్‌లో €4,499 (మన కరెన్సీలో సుమారు రూ.4.83 లక్షలు) ధరకు లాంచ్ చేసింది. భారతదేశంలో దీని ధర రూ.1.94 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచే ప్రారంభమవుతుంది. అయినప్పటికీ, స్పెయిన్ మార్కెట్‌లోని ఇతర విదేశీ బ్రాండ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తోంది. పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరకే దొరుకుతుండటంతో అక్కడ ఈ బైక్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఇంజన్, ఫీచర్లు
స్పెయిన్ వెర్షన్ పల్సర్ NS400Zలో 373.27సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 40 hp పవర్, 35 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు రైడింగ్‌ను చాలా సులభతరం చేస్తాయి. అయితే ఇండియా మోడల్‌తో పోలిస్తే స్పెయిన్ మోడల్ పవర్ 3 bhp తక్కువగా ఉంది. అలాగే ఇండియాలో అపోలో ఆల్ఫా టైర్లు ఉంటే, స్పెయిన్‌లో ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్లను అందించారు.
ట్యాక్స్ తగ్గించుకునేందుకు బజాజ్ కొత్త ఎత్తుగడ
భారత్ లాంటి మార్కెట్లలో మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునేందుకు బజాజ్ ఒక స్మార్ట్ ప్లాన్ చేస్తోంది. అదే 350సీసీ పల్సర్ వెర్షన్. ప్రస్తుతం 400సీసీ పైన ఉన్న బైకులపై ప్రభుత్వం ఏకంగా 40% జీఎస్టీ విధిస్తోంది. అదే 350సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉంటే కేవలం 18% జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఈ భారీ వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని, బజాజ్ 349.13సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను తీసుకురాబోతోంది. దీనివల్ల బైక్ ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.
పవర్ లో మార్పు ఉండదా?
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రాబోయే 350సీసీ ఇంజన్ దాదాపు 40.6 hp పవర్, 33.2 Nm టార్క్‌ను ఇస్తుందని అంచనా. అంటే పాత 400సీసీ మోడల్‌కు, దీనికి పర్ఫార్మెన్స్‌లో పెద్దగా తేడా ఉండదు. రైడర్లకు అదే పవర్ ఫీల్ కలుగుతుంది, కానీ జేబుకు మాత్రం భారం తగ్గుతుంది. ట్రయంఫ్ వంటి కంపెనీలు కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. స్టైల్, లుక్ విషయంలో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. తక్కువ ధరలో ప్రీమియం బైక్ కోరుకునే ఇండియన్ యూత్ కు ఇది నిజంగా శుభవార్తే.