Maruti : మారుతి భారీ ప్లాన్.. కార్లతో పాటు డ్రోన్‌లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా!
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా!;
Maruti : మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ. ప్రతీ నెలా లక్షలాది కార్లను అమ్ముతూ మార్కెట్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అయితే, కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ కారు కోసం అందరినీ ఎదురుచూసేలా చేస్తోంది. ఈ కారు సెప్టెంబర్ 3న మార్కెట్‌లోకి రానుంది. అయితే, ఇప్పుడు మారుతి కేవలం కార్లకే పరిమితం కాకుండా, ఇతర రంగాల్లోకి కూడా అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. మారుతి సుజుకి బోర్డు, ఆటోమొబైల్ తయారీకి మించి తమ వ్యాపార పరిధిని విస్తరించడానికి తమ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (MoA)లోని ఆబ్జెక్ట్ క్లాజ్‌లో మార్పులకు ఆమోదం తెలిపిందని ప్రకటించింది.
జులై 31, 2025న జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ మార్పులకు ఆమోదం లభించిందని, ఆగస్టు 28, 2025న జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో వాటాదారుల ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను ఉంచుతామని NSE, BSE లకు కంపెనీ తెలియజేసింది. ఈ సవరించిన క్లాజ్ ప్రకారం.. మారుతి సుజుకి ఇకపై డ్రోన్‌లు, మానవ రహిత వైమానిక వాహనాలు (UAVs), మానవ రహిత విమాన వ్యవస్థల (UAS) తయారీతో పాటు, ప్రొపల్షన్, కంట్రోల్ సిస్టమ్స్‌కు సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీల్లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.
ఈ కొత్త మార్పుల వల్ల మారుతి, వెహికల్ లీజింగ్, సబ్‌స్క్రిప్షన్, షేర్డ్ మొబిలిటీ, పాత కార్ల విక్రయాలు, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, హైడ్రోజన్, బయోగ్యాస్ ట్రేడింగ్, కార్బన్ క్రెడిట్ మానిటైజేషన్, పాత కార్ల రీసైక్లింగ్ వంటి మొబిలిటీ సర్వీసుల్లోకి కూడా ప్రవేశించనుంది. అంతేకాదు, కంపెనీ వెహికల్ టెస్టింగ్, సర్టిఫికేషన్ సదుపాయాలు, కన్సల్టింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, లాజిస్టిక్స్, సప్లై చైన్ సర్వీసులు అందించాలని కూడా ప్లాన్ చేస్తోంది.
మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు అయిన ఈ-విటారా SUV కోసం ఎదురుచూపులు ముగియబోతున్నాయి. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేయనుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, భారత్‌తో పాటు యూరోపియన్ మార్కెట్లలో కూడా దీన్ని లాంచ్ చేయనున్నారు. తొలుత యూకే, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఈ-విటారాను విక్రయిస్తారు. ఈ మోడల్‌పై కంపెనీ 10 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు దాదాపు 500 కి.మీ.ల రేంజ్ ఇవ్వనుంది. భారత మార్కెట్లో ఈ కారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ విండ్‌సర్ ఈవీ, MG ZS EV వంటి మోడళ్లతో పోటీ పడనుంది.