SUV Craze: భారతదేశంలో కొనుగోలుదారుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు చిన్న హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు ఇష్టపడే జనం, ఇప్పుడు ఎత్తైన, పవర్ఫుల్ పెద్ద ఎస్‌యూవీ కార్లను కొనడానికి ఎగబడుతున్నారు. ఈ క్రేజ్ ఆటోమొబైల్ మార్కెట్‌కే కాకుండా నగరాల్లోని పార్కింగ్ వ్యవస్థకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. పాత అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో ఉన్న పార్కింగ్ స్థలాలు ఈ భారీ కార్లకు అస్సలు సరిపోవడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్ బిల్డర్లు తమ బేస్‌మెంట్ ప్లాన్లను మార్చుకోవాల్సి వస్తోంది. మరోవైపు కార్ల కంపెనీలు కూడా ఇరుకు స్థలాల్లో కారును సురక్షితంగా పార్క్ చేసేందుకు హైటెక్ కెమెరాలు, సెన్సార్లపై దృష్టి పెడుతున్నాయి.

20 ఏళ్లలో రివర్స్ అయిన లెక్క

భారతీయుల కార్ల ఎంపికలో వచ్చిన మార్పు మెకానికల్ పార్కింగ్ సిస్టమ్స్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 20 ఏళ్ల క్రితం పార్కింగ్ వ్యవస్థలను డిజైన్ చేసేటప్పుడు 30 శాతం ఎస్‌యూవీలు, 70 శాతం సెడాన్ కార్లను దృష్టిలో పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా దాదాపు 80 శాతం ఎస్‌యూవీలు, కేవలం 20 శాతం సెడాన్ కార్లను దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ స్లాట్లను తయారు చేస్తున్నారు.

భారీ ఎస్‌యూవీల కోసం 3.2 టన్నుల లిఫ్ట్‌లు

ఎస్‌యూవీ కార్లు కేవలం పొడవు, వెడల్పులో పెద్దవిగా ఉండటమే కాదు, వాటి బరువు కూడా ఎక్కువే. దీనికి తోడు భారీ బ్యాటరీలతో వచ్చే ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరగడం పార్కింగ్ పరిశ్రమకు మరో పెద్ద సవాలుగా మారింది. గతంలో 2 టన్నుల బరువును మోసే మెకానికల్ పార్కింగ్ సిస్టమ్స్ సాధారణంగా ఉండేవి. కానీ ఇప్పుడు కంపెనీలు 2.6 టన్నుల సామర్థ్యం గల సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా 3.2 టన్నుల వరకు బరువును ఎత్తే వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు. కార్ల ఎత్తు, వెడల్పుకు తగ్గట్టుగా ప్లాట్‌ఫామ్ డిజైన్లను కూడా మారుస్తున్నారు.

బేస్‌మెంట్ డిజైన్లపై రియల్ ఎస్టేట్ బిల్డర్ల కసరత్తు

రొటీన్ అపార్ట్‌మెంట్లలో పరిమిత స్థలంలో ఎక్కువ కార్లకు పార్కింగ్ కల్పించడం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు కత్తి మీద సాములా మారింది. పెద్ద ఎస్‌యూవీలను పార్క్ చేయడానికి వెడల్పైన స్లాట్లతో పాటు, కారును సులభంగా తిప్పడానికి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. దీనివల్ల బేస్‌మెంట్లలో గతంలో పట్టినన్ని కార్లు ఇప్పుడు పట్టడం లేదు, ఫలితంగా మొత్తం పార్కింగ్ స్లాట్ల సంఖ్యపై ప్రభావం పడుతోంది.

కార్లలో పెరిగిన 360 డిగ్రీ కెమెరాల వాడకం

ఇరుకైన గల్లీలు, చిన్న పార్కింగ్ స్లాట్లు, తక్కువ స్థలం ఉన్న బేస్‌మెంట్లలో భారీ ఎస్‌యూవీలను నడపడం డ్రైవర్లకు సులభం కాదు. అందుకే ఆటోమొబైల్ కంపెనీలు రియర్ వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఈ ఏడాది అమ్ముడైన ప్రతి రెండు కొత్త కార్లలో ఒక దానిలో కచ్చితంగా రియర్ వ్యూ కెమెరా ఉంటోంది. అక్టోబర్ 2026 నాటికి 1.8 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు ఉన్న కార్ల వాటా 32.1 శాతానికి పెరిగింది. 2019తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ కావడం విశేషం.

Tags: