VinFast: ఓలా, ఏథర్‌లకు గట్టి పోటీ.. 2027 ఆరంభంలోనే భారత్‌లోకి రానున్న విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!
| విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!
VinFast: పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న వేళ భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ వచ్చే ఏడాది అంటే 2027 ప్రారంభంలోనే భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో తమిళనాడులోని తన తయారీ కేంద్రంలో ప్రత్యేక ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు చేసి, ఏటా 10 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లను తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మార్కెట్ స్పందనను చూశాకే దశలవారీగా ఉత్పత్తిని పెంచుతామని విన్‌ఫాస్ట్ ఆసియా సీఈఓ తపన్ ఘోష్ వెల్లడించారు.
విన్‌ఫాస్ట్ మొదట భారత్‌లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని యోచిస్తోంది. వియత్నాంలో అమ్ముడయ్యే మోడళ్లను కాకుండా, భారతీయ కస్టమర్ల అభిరుచికి, అవసరాలకు తగ్గట్టుగా వీటిని రూపొందిస్తున్నట్లు కంపెనీ ఇండియా 2W బిజినెస్ సీఈఓ అనురాగ్ సక్సేనా తెలిపారు. స్కూటర్ సైజు, స్టోరేజ్ స్పేస్, ఫీచర్లు అన్నీ మన రోడ్లకు, కుటుంబ అవసరాలకు సరిపోయేలా ఉంటాయి. కేవలం ఒకే వర్గానికి పరిమితం కాకుండా కుటుంబ అవసరాలు, రోజూ ఆఫీసుకు వెళ్లేవారి పనులను సులభతరం చేసేలా భిన్నమైన ఆప్షన్లను తీసుకురానుంది.
స్కూటర్లను లాంచ్ చేయకముందే దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడంపై విన్‌ఫాస్ట్ దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లోని 34 నగరాల్లో 50కి పైగా డీలర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీ, త్వరలోనే 100 నగరాల్లో 300 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా కస్టమర్లకు ఛార్జింగ్ ఇబ్బందులు, బ్యాటరీ ఖర్చు భారం తగ్గించేందుకు బ్యాటరీ స్వాపింగ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపైనా పనిచేస్తోంది.
ప్రారంభంలో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను వియత్నాం నుంచి వచ్చే సీకేడీ కిట్ల సాయంతో భారత్‌లో అసెంబుల్ చేస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లో సుమారు 15 శాతం స్థానిక విడిభాగాలను వాడుతున్నారు. ఉత్పత్తి పెరిగే కొద్దీ భారత్‌లోనే ఎక్కువ విడిభాగాలు కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తోంది. తమిళనాడులో విన్‌ఫాస్ట్‌కు ఇప్పటికే 450 ఎకరాల ప్లాంట్ ఉండగా, అదనంగా మరో 500 ఎకరాల భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
భారత మార్కెట్లో విన్‌ఫాస్ట్ ఇప్పటికే VF 7, VF 6, MPV 7, లిమో గ్రీన్ లాంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తూ 17,300కు పైగా యూనిట్ల అమ్మకాలు సాధించింది. వచ్చే ఏడాది VF 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా తీసుకురానుంది. భారత్‌లో కార్లు, టూ-వీలర్ల వ్యాపారాన్ని బలోపేతం చేశాక, ఇక్కడి నుంచే ఇతర దేశాలకు ఎగుమతి చేసే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలని కంపెనీ చూస్తోంది. 2027లో విన్‌ఫాస్ట్ స్కూటర్లు రోడ్డెక్కితే ఓలా, ఏథర్ లాంటి దేశీయ సంస్థలకు గట్టి పోటీ తప్పదు.