BMW R 12 G/S: జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ మోటరాడ్ భారత మార్కెట్లో కొత్త ఆఫ్‌రోడ్ అడ్వెంచర్ బైక్‌ BMW R 12 G/Sను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.25.40 లక్షలుగా నిర్ణయించింది. ఈ బైక్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేస్తారు. ఇక్కడ కేవలం ప్రో వేరియంట్‌నే విక్రయించనున్నారు. ఇప్పటికే బుకింగ్స్‌తో పాటు డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన దిగ్గజ BMW R 80 G/S బైక్‌ రూపకల్పన నుంచి స్ఫూర్తి పొంది కొత్త మోడల్‌ను తీర్చిదిద్దారు. పాతకాలపు రూపానికి ఆధునిక సాంకేతికతను జోడించి తయారు చేశారు.

1,170 సీసీ ఇంజిన్.. 109 హెచ్‌పీ శక్తి

ఈ బైక్‌లో 1,170 సీసీ కెపాసిటీ కలిగిన రెండు సిలిండర్ల బాక్సర్ ఇంజిన్‌ అమర్చారు. ఇది గాలి, నూనె సాయంతో చల్లబడుతుంది. ఈ ఇంజిన్‌ 7,000 ఆర్‌పీఎం వద్ద 109 హెచ్‌పీ శక్తిని, 6,500 ఆర్‌పీఎం వద్ద 115 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది. బాక్సర్ ఇంజిన్‌ ప్రత్యేక అమరిక వల్ల బైక్‌కు మంచి లాగుడు శక్తి లభిస్తుంది. ఇందులో షాఫ్ట్ డ్రైవ్ వ్యవస్థ కూడా ఉంది. ఎగ్జాస్ట్ పైపును బైక్‌ ఎడమవైపు అమర్చి, వెనుక భాగంలో పైకి లేపినట్టుగా సైలెన్సర్‌ను ఏర్పాటు చేశారు. ఈ అమరిక కఠినమైన రహదారులపై ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

ఆఫ్‌రోడ్ ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు

కఠినమైన రోడ్లపై బైక్‌ను సులభంగా నడిపేందుకు ప్రత్యేక పరికరాలు ఇచ్చారు. ముందు భాగంలో 21 అంగుళాల చక్రం, వెనుక భాగంలో 18 అంగుళాల చక్రం ఉన్నాయి. రెండు చక్రాలకూ క్రాస్‌ స్పోక్‌ అమరిక ఇచ్చారు. ముందు భాగంలో 210 మిల్లీమీటర్ల ప్రయాణ పరిధి కలిగిన పూర్తిగా సర్దుబాటు చేసుకునే అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్క్‌ ఉంది. వెనుక భాగంలో 200 మిల్లీమీటర్ల ప్రయాణ పరిధితో సస్పెన్షన్‌ ఏర్పాటు చేశారు. ఆఫ్‌రోడ్ ప్యాకేజీలో ప్రత్యేక టైర్లు, బలమైన ఫుట్‌రెస్టులు, ఇంజిన్‌ గార్డు, హ్యాండిల్‌బార్ రైజర్లు, చేతుల రక్షణ పరికరాలు ఉన్నాయి. ఈ బైక్‌ బరువు 229 కిలోలు. సీటు ఎత్తు 875 మిల్లీమీటర్లు కావడంతో తక్కువ ఎత్తు ఉన్నవారు ఒకసారి నడిపి చూసిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

రైడింగ్ మోడ్‌లు.. భద్రతకు పెద్దపీట

వేర్వేరు రహదారి పరిస్థితులకు తగ్గట్టుగా రైన్‌, రోడ్‌, ఎండ్యూరో రైడింగ్ మోడ్‌లు ఇచ్చారు. ఆఫ్‌రోడ్ ప్యాకేజీలో అదనంగా ఎండ్యూరో ప్రో మోడ్‌ కూడా ఉంటుంది. వేగం పెంచేటప్పుడు చక్రాలు జారిపోకుండా డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్‌ సాయపడుతుంది. ఇంజిన్‌ వేగం తగ్గే సమయంలో వెనుక చక్రంపై నియంత్రణకు ఇంజిన్‌ డ్రాగ్ టార్క్ కంట్రోల్‌ ఉపయోగపడుతుంది. ముందు భాగంలో రెండు 310 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేకులు, వెనుక 265 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌ ఉన్నాయి. మలుపుల్లో బైక్‌ వంగి ఉన్నప్పటికీ బ్రేకింగ్‌ నియంత్రణ మెరుగ్గా ఉండేందుకు బీఎండబ్ల్యూ ఏబీఎస్ ప్రో సాంకేతికతను అందించింది. ఆఫ్‌రోడ్ ప్రయాణంలో అవసరమైతే ట్రాక్షన్ కంట్రోల్‌ను నిలిపివేయవచ్చు.

ఖరీదైన బైక్‌లో అదనపు సౌకర్యాలు

ఈ మోడల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, 12 వోల్ట్‌ విద్యుత్‌ సాకెట్‌ ఉన్నాయి. కంఫర్ట్ ప్యాకేజీలో భాగంగా క్లచ్‌ ఉపయోగించకుండా గేర్లు మార్చుకునే షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో, క్రూయిజ్ కంట్రోల్‌, కొండ ఎక్కేటప్పుడు వెనక్కి జారకుండా సాయపడే హిల్‌ స్టార్ట్ కంట్రోల్‌, వేడిని అందించే హ్యాండిల్ గ్రిప్స్‌ ఇచ్చారు. చీకట్లో మలుపుల వద్ద మెరుగైన వెలుతురు అందించేందుకు అడాప్టివ్ హెడ్‌ల్యాంప్‌ కూడా ఉంది. బీఎండబ్ల్యూ R 12 G/S ధర రూ.25.40 లక్షలు ఎక్స్‌షోరూమ్‌ మాత్రమే. రహదారి పన్నులు, బీమా, ఇతర రిజిస్ట్రేషన్‌ ఖర్చులు కలిపితే ఆన్‌రోడ్ ధర మరింత పెరుగుతుంది. భారీ ఇంజిన్‌, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, ప్రత్యేక రూపం కోరుకునే వారికి ఇది ఆసక్తికరమైన ఎంపిక.

Tags: