Honda Avancier: హోండా కొత్త ఎస్‌యూవీ అవాన్సియర్‌ను నవంబర్ 20న ప్రపంచానికి పరిచయం చేసింది. మూడు వరుసల సీట్లతో రూపొందించిన ఈ కారును కుటుంబ ప్రయాణాలకు అనువుగా తయారు చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు విలాసవంతమైన క్యాబిన్, ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీని ఇందులో అందించింది.

ఆకట్టుకునే డిజైన్

హోండా అవాన్సియర్ ముందు భాగంలో సన్నని హెడ్‌లైట్లు, పెద్ద గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పక్కవైపు పొడవైన డిజైన్, వెనుక భాగంలో ప్రత్యేక ఆకృతిలో టెయిల్‌లైట్లు ఉన్నాయి. డోర్ హ్యాండిళ్లను కారు బాడీకి సమాంతరంగా అమర్చారు. వెనుక వైపర్ బయటకు కనిపించకుండా ఏర్పాటు చేశారు. హోండా కొత్త హెచ్‌ లోగోను ఉపయోగించిన తొలి హైబ్రిడ్ మోడల్ కూడా ఇదే.

విలాసవంతమైన క్యాబిన్.. ప్రత్యేక సీటింగ్ సౌకర్యాలు

కారు లోపల విశాలమైన క్యాబిన్‌ను అందించారు. డ్యాష్‌బోర్డుపై పెద్ద టచ్‌స్క్రీన్ ఉంది. గేర్ మార్చే వ్యవస్థను స్టీరింగ్ దగ్గరికి మార్చడంతో ముందు భాగంలో ఎక్కువ స్థలం లభిస్తుంది. రెండో వరుస సీట్లలో కూర్చునేవారి కోసం పెద్ద ఆర్మ్‌రెస్టులు, వేడి చేసే సీట్లు, చల్లబరిచే సీట్లు ఇచ్చారు. పనోరమిక్ సన్‌రూఫ్ మూడో వరుస వరకు విస్తరించి ఉంటుంది. 12 స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్ డాల్బీ అట్మాస్‌కు మద్దతు ఇస్తుంది. వాయిస్ కమాండ్లతో కొన్ని ఫీచర్లను నియంత్రించవచ్చు. ఫోన్ ద్వారా కారు లోపలి దృశ్యాన్ని, చుట్టుపక్కల పరిస్థితులను చూసే సదుపాయాలను కూడా అందించాలని హోండా భావిస్తోంది.

కొత్త తరం హైబ్రిడ్ టెక్నాలజీ

అవాన్సియర్‌లో హోండా కొత్త తరం హైబ్రిడ్ వ్యవస్థను తొలిసారిగా ఉపయోగించింది. ఇందులో రెండు మోటార్లు ఉంటాయి. ఒకటి చక్రాలకు శక్తిని అందిస్తే, మరొకటి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ పనితీరు, మోటార్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఇంధన పొదుపు పెంచేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అయితే కారు మైలేజీ, ఇంజిన్ పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఎలక్ట్రిక్ ఆల్ వీల్ డ్రైవ్ సదుపాయం

ఈ ఎస్‌యూవీలో డ్యూయల్ పవర్ ఈ-ఏడబ్ల్యూడీ వ్యవస్థను కూడా అందించారు. ఇందులో ముందు, వెనుక చక్రాలకు వేర్వేరు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. రహదారి పరిస్థితులను బట్టి ఏ చక్రాలకు ఎంత శక్తి అందించాలో ఈ వ్యవస్థ సర్దుబాటు చేస్తుంది. దీంతో కారు వేగం పెరగడంతో పాటు ప్రయాణంలో స్థిరత్వం మెరుగుపడుతుందని హోండా చెబుతోంది. సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్ ద్వారా అప్‌డేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

భారత్‌లోకి వస్తుందా?

అవాన్సియర్‌ను తొలుత థాయ్‌లాండ్‌లో విడుదల చేయాలని హోండా ప్రణాళిక రూపొందించింది. ఆ తర్వాత జపాన్, చైనా సహా ఇతర మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. జపాన్‌లో 2027 వసంతకాలంలో విడుదల చేయాలని భావిస్తోంది. అయితే భారత్‌లో ఈ ఎస్‌యూవీని తీసుకొస్తారా లేదా అనే విషయంపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Tags: