Bike Mileage Tips : బైక్ మైలేజీ రావట్లేదా? ఈ చిన్న తప్పులు చేయకండి..ట్యాంక్ ఫుల్ చేస్తే నెలంతా వాడొచ్చు
ట్యాంక్ ఫుల్ చేస్తే నెలంతా వాడొచ్చు
Bike Mileage Tips : భారతదేశంలో బైక్ కొనేటప్పుడు అందరూ అడిగే మొదటి ప్రశ్న.. మైలేజీ ఎంత ఇస్తుంది? అని. అయితే, కేవలం మంచి మైలేజీ ఇచ్చే బైక్ కొంటే సరిపోదు, దానిని మనం ఎలా వాడుతున్నాం అనే దానిపైనే అసలు మైలేజీ ఆధారపడి ఉంటుంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ బైక్ మైలేజీని అద్భుతంగా పెంచుకోవచ్చు. మీ బైక్ ట్యాంక్ ఫుల్ చేస్తే ఎక్కువ రోజులు రావాలంటే ఈ క్రింది విషయాలను తప్పక గమనించండి.
టైర్ ప్రెజర్
చాలామంది బైక్ టైర్లలో గాలిని పట్టించుకోరు. కానీ, టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుపై బైక్ వెళ్ళేటప్పుడు ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల ఇంజిన్‌పై అదనపు భారం పడి, పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుంది. కంపెనీ సూచించిన విధంగా టైర్లలో కరెక్ట్ గాలి ఉండేలా చూసుకోవాలి. గాలి మరీ ఎక్కువగా ఉన్నా ప్రమాదమే, కాబట్టి సరైన స్థాయిలో ఉంచడం వల్ల బైక్ సాఫీగా సాగుతుంది మరియు మైలేజీ పెరుగుతుంది.
క్రమం తప్పకుండా సర్వీసింగ్
మీ బైక్ ఇంజిన్ ఎంత ఫిట్‌గా ఉంటే అంత తక్కువ పెట్రోల్ తాగుతుంది. నిర్ణీత సమయంలో ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్లను శుభ్రం చేయడం లేదా అవసరమైతే మార్చడం చేయాలి. ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము పేరుకుపోతే ఇంజిన్‌కు గాలి అందక ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. అందుకే రెగ్యులర్ సర్వీసింగ్ అనేది బైక్ మైలేజీకి ప్రాణం లాంటిది.
బరువు పెంచకండి
బైక్ అనేది తక్కువ బరువు మోసే వాహనం. దానిపై అవసరానికి మించి బరువు వేస్తే ఇంజిన్ కష్టపడాల్సి వస్తుంది. బైక్ వెనుక సీటుపై అనవసరమైన పెద్ద పెద్ద బ్యాగులు లేదా సామాన్లు మోయడం వల్ల మైలేజీ పడిపోతుంది. అలాగే, బైక్ మోడిఫికేషన్లు చేస్తూ భారీ లెగ్ గార్డ్లు లేదా ఎక్స్‌ట్రా యాక్సెసరీస్ వేయడం వల్ల కూడా బరువు పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు బైక్‌ను తేలికగా ఉంచడానికి ప్రయత్నించండి.
రైడింగ్ స్టైల్
బైక్ నడిపే విధానం మైలేజీని బాగా ప్రభావితం చేస్తుంది. పదే పదే గంటకు 80-100 కిమీ వేగంతో వెళ్లడం, మళ్ళీ సడన్ బ్రేకులు వేయడం వల్ల పెట్రోల్ వృథా అవుతుంది. బైక్‌ను ఎప్పుడూ 40 నుండి 50 కిమీ మధ్య స్థిరమైన వేగంతో నడిపితే గరిష్ట మైలేజీ వస్తుంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆపేయడం అలవాటు చేసుకోండి. క్లచ్‌ను పదే పదే నొక్కడం కూడా మైలేజీని తగ్గిస్తుంది.