CNG Kit: పెట్రోల్ కార్లో సీఎన్‌జీ కిట్ వేయించాలా? అసలు ఖర్చు ఎంతవుతుందో తెలుసా!
అసలు ఖర్చు ఎంతవుతుందో తెలుసా!
CNG Kit: పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో చాలా మంది వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా నెలవారీ ఇంధన ఖర్చును తగ్గించుకోవడానికి పెట్రోల్ కార్లలో సీఎన్‌జీ కిట్లను అమర్చుకోవడం ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. అయితే మీ పెట్రోల్ కారులో సీఎన్‌జీ కిట్ వేయించే ముందు దానికయ్యే ఖర్చు, లాభాలు, నష్టాలు, పాటించాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సీఎన్‌జీ కిట్ అమర్చడానికి ఎంత ఖర్చవుతుంది?
మీ కారు కంపెనీ నుంచి సీఎన్‌జీ వేరియంట్‌లో రాకపోతే, మార్కెట్ నుంచి ఆఫ్టర్‌మార్కెట్ సీఎన్‌జీ కిట్‌ను ఫిట్ చేయించుకోవచ్చు. మంచి క్వాలిటీ గల సీక్వెన్షియల్ సీఎన్‌జీ కిట్ ధర సుమారు రూ.35 వేల నుంచి 55 వేల వరకు ఉంటుంది. అయితే కారు మోడల్, ఇంజిన్ సామర్థ్యం, కిట్ క్వాలిటీని బట్టి ఈ ఖర్చు మారుతుంటుంది. మీ కారు రోజూ సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటే, పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీ ద్వారా వచ్చే ఆదా కారణంగా కొద్ది రోజుల్లోనే ఈ పెట్టుబడి డబ్బులు వెనక్కి వస్తాయి. ఒకవేళ నెలలో కారు వాడకం తక్కువగా ఉంటే, ఖర్చు రికవరీ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
బూట్ స్పేస్ మరియు పనితీరుపై ప్రభావం
కారులో సీఎన్‌జీ సిలిండర్ అమర్చడం వల్ల బూట్ స్పేస్ స్థలం చాలా వరకు తగ్గిపోతుంది. మీరు తరచూ లగేజ్ సర్దుకునే వారైతే ఈ విషయాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే, పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీపై నడిపినప్పుడు కారు పవర్, పిక్‌అప్‌లో స్వల్ప తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ బరువుతో లేదా వేగంగా వెళ్తున్నప్పుడు ఈ మార్పు కొద్దిగా తెలుస్తుంది. అయితే సరిగ్గా సెట్ చేసిన నాణ్యమైన కిట్ అయితే రోజూవారీ డ్రైవింగ్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తదు.
భద్రత, ఫిట్‌మెంట్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సీఎన్‌జీ కిట్ ఎప్పుడైనా సరే కారు ఇంజిన్‌కు సరిపోయేలా, ఏదైనా అధీకృత లేదా నమ్మకమైన సెంటర్‌లోనే ఫిట్ చేయించుకోవాలి. నాణ్యత లేని కిట్లు లేదా తప్పుగా ఫిట్ చేయడం వల్ల కారు పనితీరు దెబ్బతినడమే కాకుండా భద్రతాపరమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. సిలిండర్, గ్యాస్ పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించడం అత్యవసరం. ఏమాత్రం గ్యాస్ వాసన వచ్చినా లేదా సమస్య అనిపించినా వెంటనే మెకానిక్‌ను సంప్రదించడం మంచిది.