Toyota : టయోటా నుండి సరికొత్త కారు.. 25 కి.మీలకు పైగా మైలేజ్.. ఫీచర్లు ఫోర్ట్యూనర్ కన్నా ధీటుగా
25 కి.మీలకు పైగా మైలేజ్.. ఫీచర్లు ఫోర్ట్యూనర్ కన్నా ధీటుగా;
Toyota : టయోటా తన ప్రీమియం సెడాన్ క్యామ్రీ స్పింట్ ఎడిషన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 48.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. నవంబర్ 2024లో వచ్చిన 8వ జనరేషన్ క్యామ్రీ తర్వాత ఇది కంపెనీ నుంచి వచ్చిన మొదటి ప్రత్యేక ఎడిషన్. ఈ కొత్త క్యామ్రీ స్పింట్ ఎడిషన్‌లో స్పోర్టీ లుక్‌తో పాటు కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు. అయితే, మైలేజ్‌పై దృష్టి పెడుతూ పాత హైబ్రిడ్ ఇంజిన్‌ను యథావిధిగా ఉంచారు. భారత మార్కెట్‌లో 2002 నుంచి అమ్ముడవుతున్న క్యామ్రీ లగ్జరీ సెడాన్ సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
స్పింట్ ఎడిషన్‌ను సాధారణ క్యామ్రీ నుంచి వేరుగా చూపించడానికి అనేక కాస్మెటిక్ మార్పులు చేశారు. దీనిలో డ్యుయల్-టోన్ పెయింట్ స్కీమ్ ఉంది. కారు బాడీ కలర్‌తో పాటు బోనెట్, రూఫ్, డిక్కీపై మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. మ్యాట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, కొత్త ఫ్రంట్, రియర్ బంపర్ డిజైన్, రియర్ స్పాయిలర్‌తో కూడిన స్పోర్ట్స్ కిట్ కూడా ఉన్నాయి. ఈ మార్పుల వల్ల క్యామ్రీ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది.
క్యామ్రీ స్పింట్ ఎడిషన్‌లో పాత ఫీచర్లతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు. ఇందులో యాంబియంట్ లైటింగ్, డోర్ వార్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. 10-వే పవర్ డ్రైవర్ సీట్ విత్ మెమరీ ఫంక్షన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలోనూ మరింత మెరుగుపరిచారు. టయోటా సేఫ్టీ సెన్స్ 3.0, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, ప్రీ-కొలిజన్ సిస్టమ్, ఆటోమేటిక్ హై బీమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 9 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా కూడా ఇందులో ఉన్నాయి.
స్పింట్ ఎడిషన్‌లో సాధారణ క్యామ్రీ హైబ్రిడ్‌లో ఉన్న ఇంజినే ఉంది. ఇందులో 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5వ జనరేషన్ హైబ్రిడ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ రెండింటి కలయికతో ఇది 230 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ-సీవీటీ గేర్‌బాక్స్ ఉంది. ఈ కారు 25.49 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది, ఇది దాని సెగ్మెంట్‌లో అత్యధికం. బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీల వారంటీ లభిస్తుంది. స్పింట్ ఎడిషన్‌ను 5 డ్యుయల్-టోన్ కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేశారు.