Car Service : కారు సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి? 10 వేల కిలోమీటర్లా లేక ఏడాది కాలమా? అసలు నిజం ఇవే
10 వేల కిలోమీటర్లా లేక ఏడాది కాలమా? అసలు నిజం ఇవే
Car Service : కొత్త కారు కొన్నప్పుడు ఉండే ఉత్సాహం దాన్ని మెయింటెయిన్ చేసేటప్పుడు కూడా ఉండాలి. చాలామంది వాహనదారులకు వచ్చే అతి పెద్ద సందేహం ఏంటంటే.. కారు సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి? 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత చేయించాలా లేక ఏడాది పూర్తయ్యాక చేయించాలా? ఈ విషయంలో క్లారిటీ లేకపోతే కారు ఇంజిన్ పాడవ్వడమే కాకుండా, మీ జేబుకు కూడా భారీ చిల్లు పడే అవకాశం ఉంది. కారు పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా, మైలేజీ తగ్గకూడదన్నా సరైన సమయంలో సర్వీసింగ్ చేయించడం ప్రాణప్రదం.
మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలన్నీ ఒకటే సూత్రం చెబుతాయి. అదే "10,000 కిలోమీటర్లు లేదా ఏడాది కాలం.. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అప్పుడు" సర్వీసింగ్ చేయించాలి. అంటే.. మీరు కారు కొన్న ఎనిమిది నెలలకే 10,000 కిలోమీటర్లు తిరిగేస్తే వెంటనే సర్వీసింగ్ చేయించాలి. ఒకవేళ ఏడాది గడిచినా మీ కారు కేవలం 3,000 కిలోమీటర్లే తిరిగినా సరే, ఖచ్చితంగా సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. కిలోమీటర్లు తక్కువ తిరిగింది కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ ఆయిల్ తన చిక్కదనాన్ని కోల్పోయి ఇంజిన్ లోపలి భాగాలను పాడు చేస్తుంది.
కారు తక్కువ తిరిగినా సర్వీసింగ్ ఎందుకు అవసరం అంటే.. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ వంటి ద్రవ పదార్థాలు కారు నడిచినా నడవకపోయినా కాలక్రమేణా తమ ప్రభావాన్ని కోల్పోతాయి. గాలిలోని తేమ వల్ల ఆయిల్ నాణ్యత తగ్గిపోతుంది. అలాగే ఎయిర్ ఫిల్టర్లలో దుమ్ము చేరి ఇంజిన్‌కు గాలి అందకుండా చేస్తుంది. సర్వీసింగ్ సమయంలో కేవలం ఆయిల్ మార్చడమే కాకుండా.. బ్రేక్ ప్యాడ్ల కండిషన్, బ్యాటరీ హెల్త్, టైర్ల అరుగుదల, వైపర్లు, లైట్లు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ను నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. దీనివల్ల మధ్యదారిలో కారు ఆగిపోయే ప్రమాదం తప్పుతుంది.
సమయానికి సర్వీసింగ్ చేయించడం వల్ల కలిగే లాభాలు అనేకం. మొదటిది, మీ కారు మైలేజీ స్థిరంగా ఉంటుంది. రెండోది, ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, చిన్న చిన్న సమస్యలను ముందే గుర్తించి పరిష్కరించడం వల్ల భవిష్యత్తులో వచ్చే భారీ రిపేర్ ఖర్చుల నుంచి మీరు తప్పించుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో మీ కారుకు మంచి ధర రావాలన్నా సర్వీసింగ్ రికార్డులు పక్కాగా ఉండాలి. అందుకే కిలోమీటర్ల లెక్కతో సంబంధం లేకుండా ఏడాదికోసారి మీ కారుకు హెల్త్ చెకప్ చేయించడం మర్చిపోకండి.