Citroen Basalt vs Kia Sonet: కాంపాక్ట్ ఎస్యూవీ వార్.. కొత్తగా వచ్చిన సిట్రోయెన్ బసాల్ట్ vs కియా సోనెట్ ఏది బెస్ట్
కొత్తగా వచ్చిన సిట్రోయెన్ బసాల్ట్ vs కియా సోనెట్ ఏది బెస్ట్
Citroen Basalt vs Kia Sonet: భారతీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. సిట్రోయెన్ తమ కొత్త బసాల్ట్ కూపే ఎస్‌యూవీను లాంచ్ చేయడంతో, ఇది నేరుగా కియా సోనెట్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచింది. ఈ రెండు ఎస్‌యూవీలు అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌లు, ఫీచర్-ప్యాక్డ్ ఇంటీరియర్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, ఈ రెండింటిలో ఏది ఎక్కువ విలువైన ఎంపిక అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సిట్రోయెన్ బసాల్ట్ కంఫర్ట్, టెక్నాలజీ కలయికతో రూపొందించబడింది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదరెట్ అప్‌హోల్‌స్ట్రీ, 470 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తాయి. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. మరోవైపు, కియా సోనెట్ ఎల్లప్పుడూ ప్రీమియం ఫీచర్లలో అగ్రస్థానంలో ఉంటుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్ వంటి అధునాతన సౌకర్యాలు సోనెట్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో కియా సోనెట్ కొంచెం మెరుగ్గా ఉంది.
సిట్రోయెన్ బసాల్ట్లో 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మాన్యువల్ వేరియంట్‌లో 82 PS పవర్, 115 Nm టార్క్, టర్బో వేరియంట్‌లో 110 PS పవర్, 205 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 18 నుండి 18.7 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. కియా సోనెట్ ఇంజిన్ ఆప్షన్ల విషయంలో బసాల్ట్‌కు చాలా ముందుంది. ఇందులో 1.2L పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్‌లోనూ 5-స్పీడ్ మాన్యువల్ నుంచి 7-స్పీడ్ DCT వరకు అనేక ఎంపికలు ఉన్నాయి. కాబట్టి, డీజిల్, అధిక పనితీరు, ఎక్కువ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ కోరుకునే వారికి సోనెట్ మెరుగైన ఎంపిక.
బసాల్ట్లో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, ABS + EBD, TPMS, ISOFIX చైల్డ్ యాంకర్స్ వంటివి లభిస్తాయి. కియా సోనెట్ మరింత అధునాతన భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఇందులో లెవల్-1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC , HAC వంటివి ఉన్నాయి. ADAS వంటి అధునాతన టెక్నాలజీ కారణంగా భద్రతలో కియా సోనెట్ పైచేయి సాధించింది.
సిట్రోయెన్ బసాల్ట్ ధర రూ.7.95 లక్షల నుంచి రూ.14.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కియా సోనెట్ ధర రూ.7.30 లక్షల నుంచి రూ.14.09 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ధరలు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, కియా సోనెట్ లో ఎక్కువ ఇంజిన్ ఆప్షన్లు, డీజిల్ వేరియంట్, లెవల్-1 ADAS వంటి అదనపు ప్రీమియం ఫీచర్లు ఉండటం వల్ల ఇది మంచి విలువ అందిస్తుంది. అయితే, యూరోపియన్ డిజైన్, సాఫ్ట్ సస్పెన్షన్, కంఫర్టబుల్ డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే వారికి సిట్రోయెన్ బసాల్ట్ బెస్టుగా ఉంటుంది.