Denza Z9 GT: ఫోన్ ఛార్జింగ్ కంటే వేగంగా ఛార్జింగ్.. ఈ చైనా కారు టెక్నాలజీకి ఫిదా అంతే
ఈ చైనా కారు టెక్నాలజీకి ఫిదా అంతే
Denza Z9 GT: భారత లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సంచలనం సృష్టించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ డెంజా తన అత్యంత ఖరీదైన ఫ్లాగ్షిప్ కారు Z9 GTని అధికారికంగా విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.56 కోట్లుగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.10 లక్షలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు టయోటా వెల్ఫైర్, లెక్సస్ ఎల్ఎం వంటి దిగ్గజ వాహనాలకు గట్టి పోటీ ఇచ్చేలా D9 ఎంపీవీని కూడా కంపెనీ భారత్‌కు తీసుకొచ్చింది. 4-డోర్ షూటింగ్ బ్రేక్ డిజైన్‌తో రూపొందిన Z9 GT, లగ్జరీతో పాటు సూపర్‌కార్ స్థాయి వేగాన్ని కోరుకునే వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది.
కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్
ఈ కారు పనితీరు సాధారణ ఎలక్ట్రిక్ కార్లకు పూర్తిగా భిన్నంగా, ఒక రేసింగ్ కారును తలపించేలా ఉంది. ఇందులో భారీ 122.5kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు మూడు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఇవి కలిసి ఏకంగా 1,139 hp, 1,210Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 270 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 670 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంతేకాకుండా 1,500kW ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 9 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
పీతలా నడిచే టెక్నాలజీ
పరిమాణంలో చాలా పెద్దదిగా ఉండే ఈ కారు పొడవు 5,180 మిల్లీమీటర్లు కాగా, 3,125 మిల్లీమీటర్ల వీల్‌బేస్ కలిగి ఉంది. 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, పిరెల్లీ టైర్లు, పైకప్పుపై అత్యాధునిక లైడార్ సెన్సార్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇరుకైన ప్రదేశాల్లో కూడా సులభంగా తిరిగేలా ఇందులో రియర్-వీల్ స్టీరింగ్ ఇచ్చారు. దీనివల్ల వెనుక చక్రాలు 15 డిగ్రీల వరకు తిరుగుతాయి. తద్వారా కారు పక్కకు పీతలా నడిచే క్రాబ్-వాక్ ఫీచర్, ఉన్నచోటే 360 డిగ్రీలు తిరిగే అద్భుత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే ఇంటీరియర్
కారు లోపలి భాగం అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. ముందు సీట్లతో పాటు వెనుక సీట్లలో కూర్చునే వారికి కూడా హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ సదుపాయాలు కల్పించారు. డ్యాష్‌బోర్డ్‌పై 17.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, ముందు ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా 13.2-అంగుళాల స్క్రీన్, డ్రైవర్ డిజిటల్ డిస్ప్లే ఉన్నాయి. 20 స్పీకర్ల డెవియాలెట్ సౌండ్ సిస్టమ్, సాఫ్ట్-క్లోజ్ డోర్లు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ప్రయాణికుల రక్షణ కోసం 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో పార్క్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, ముందు వెనుక భాగాలలో 12 రాడార్ సెన్సార్లను ఏర్పాటు చేశారు.