Yamaha: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ యమహా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన దూకుడును పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కంపెనీ సరికొత్త జెంటర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. సాధారణంగా మార్కెట్లో లభించే 125 సీసీ పెట్రోల్ స్కూటర్లకు దీటుగా దీన్ని రూపొందించారు. రోజువారీ ఆఫీసులకు వెళ్లేవారు అలాగే నగరాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నిశ్శబ్దంగా పనిచేసే సైలెంట్ ఎలక్ట్రిక్ మోటార్ దీని ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద 16 అంగుళాల చక్రాలు

ఈ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే ముందు భాగంలో దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్ ఇచ్చారు. ఫ్రంట్ లుక్ చాలా సింపుల్‌గా, నిటారుగా ఉంటుంది. కాళ్లు పెట్టుకోవడానికి విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, రెండు భాగాలుగా ఉండే సీటు, అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్ దీనికి మోడర్న్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం దీని 16 అంగుళాల పెద్ద చక్రాలు. చెడ్డ రోడ్లపై కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణించేందుకు ఈ పెద్ద వీల్స్ ఎంతగానో సహకరిస్తాయి. భద్రత కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు ఏబీఎస్ సౌకర్యం కల్పించారు.

108 కిలోమీటర్ల మైలేజ్, పవర్ఫుల్ మోటార్

యమహా జెంటర్ ఈ స్కూటర్‌లో 3-ఫేజ్ ఎక్సైటేషన్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 7.5kW పవర్‌ను, 33.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 70.2Ah కెపాసిటీ గల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇందులో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉండటం వల్ల బ్రేక్ వేసినప్పుడు వచ్చే పవర్ బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సాధారణ హోమ్ సాకెట్ ద్వారా బ్యాటరీ పూర్తిగా నిండడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది.

మోడ్రన్ ఫీచర్లు, రైడింగ్ మోడ్స్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 121 కిలోలు ఉండగా, సీటు ఎత్తు 790 మిమీగా ఉంది. టెక్నాలజీ పరంగా ఇందులో 5 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఇచ్చారు. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకుని టర్న్-బై-టర్న్ నావిగేషన్ వాడుకోవచ్చు. కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. రైడర్ తన సౌలభ్యం ప్రకారం మూడు వేర్వేరు రైడింగ్ మోడ్స్‌ను ఎంచుకునే అవకాశం కల్పించారు. త్వరలోనే ఈ స్కూటర్ మార్కెట్లో అధికారికంగా అమ్మకాలకు రానుంది.

Tags: