Honda CB500: భారత టూ-వీలర్ మార్కెట్లో మళ్లీ పెద్ద సింగిల్-సిలిండర్ బైక్‌ల హవా మొదలయ్యేలా కనిపిస్తోంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా తన కొత్త హోండా CB500 బైక్‌ను 501cc ఇంజిన్‌తో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 2020లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ 500cc మోడళ్లను నిలిపివేసిన తర్వాత ఈ విభాగం దాదాపు ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ హోండా మూడు వేరియంట్లలో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, 2026 ముగిసేలోపే కస్టమర్లకు డెలివరీలు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

హోండాలోనే అతిపెద్ద ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్

కొత్త CB500 బైక్‌లో 501cc ఎయిర్-అండ్-ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. భారత ఆటో రంగంలో హోండా నుంచి వస్తున్న అతిపెద్ద ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ బైక్ ఇదే కావడం విశేషం. ఈ ఇంజిన్ 5,250 rpm వద్ద 28 hp పవర్, 3,750 rpm వద్ద 43.3 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ఆర్‌పీఎం వద్దే భారీ టార్క్ రావడం వల్ల నగర ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌లోనూ బైక్ ఎంతో స్మూత్‌గా దూసుకెళ్తుంది.

మూడు వేరియంట్లు.. రూ.2.75 లక్షల నుంచి ప్రారంభ ధర

కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా CB500ను మూడు వేరియంట్లలో విడుదల చేశారు. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు, రంగుల వివరాలు

* బేస్ అల్లాయ్ వేరియంట్: రూ.2.75 లక్షలు (పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే రంగులు).

* మిడ్ స్పోక్ వేరియంట్: రూ.3 లక్షలు (క్రాస్ స్పోక్ ట్యూబ్‌లెస్ రిమ్స్; రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ స్టీల్ సిల్వర్ మెటాలిక్ రంగులు).

* టాప్ వేరియంట్: రూ.3.02 లక్షలు (స్పోక్ వీల్స్, ప్రత్యేక గ్రాఫిక్స్; స్ట్రైప్స్‌తో కూడిన పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ రంగు).

ఆధునిక ఫీచర్లు, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ సపోర్ట్

ఈ మూడు వేరియంట్లలోనూ హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన రైడింగ్ కోసం 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఇచ్చారు. బైక్ ముందు భాగంలో 19 అంగుళాల చక్రం, వెనుక 17 అంగుళాల చక్రం ఉన్నాయి. బ్రేకింగ్ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అందించారు.

క్లాసిక్ 350 కంటే తక్కువ బరువు

సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ప్రీలోడ్ అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. హోండా CB500 మొత్తం బరువు 189 కిలోలు మాత్రమే. హోండా CB350 బరువు 181 కిలోలు కాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బరువు 195 కిలోలుగా ఉంది. 500cc బైక్ అయినా బరువు అదుపులో ఉండటం, 168mm గ్రౌండ్ క్లియరెన్స్ రావడంతో మన భారతీయ రోడ్లపై సిటీ రైడ్‌తో పాటు లాంగ్ ట్రిప్స్‌కు కూడా ఇది చక్కటి ఎంపికగా నిలవనుంది.

Tags: