Honda : టాటాకు చెక్ పెట్టేందుకు ముగ్గురు మొనగాళ్లను దింపుతున్న హోండా
ముగ్గురు మొనగాళ్లను దింపుతున్న హోండా
Honda : భారత మార్కెట్‌లో ప్రస్తుతం కేవలం మూడు మోడళ్లను (రెండు సెడాన్‌లు, ఒక ఎస్‌యూవీ) మాత్రమే అమ్ముతున్న హోండా కార్స్, తమ అమ్మకాలను పెంచుకోవడానికి ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు వస్తోంది. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ 2.0 తర్వాత కంపెనీ 5,305 యూనిట్ల అమ్మకాలతో ఈ ఏడాదిలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఇదే ఉత్సాహంతో మారుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ ఇప్పుడు మూడు కొత్త ఎస్‌యూవీలను భారత మార్కెట్‌లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వీటిలో రెండు హైబ్రిడ్ మోడళ్లు కాగా, ఒకటి పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్. ఈ కొత్త కార్లు హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.
హోండా ఎలివేట్ హైబ్రిడ్
ప్రస్తుతం హోండా భారత లైనప్‌లో ఉన్న ఏకైక ఎస్‌యూవీ ఎలివేట్. ఇప్పుడు కంపెనీ దీని హైబ్రిడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలివేట్ హైబ్రిడ్ టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బ్రెజిల్‌లో దీని టెస్ట్ మోడల్‌ను గుర్తించారు. ఇది బయటి డిజైన్ పరంగా ప్రస్తుత ఎలివేట్ మాదిరిగానే ఉన్నప్పటికీ, తుది వెర్షన్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌లో తేలికైన, మరింత ఎఫీషియంట్ స్పేర్ పార్ట్స్, సింపుల్ డిజైన్ ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో చిన్న, మరింత ఎనర్జీ-డెన్సిటీ గల ఇంజిన్, లైట్ వెయిట్ బ్యాటరీ, మెరుగైన ట్రాన్స్‌మిషన్ సెటప్ ఉండనున్నాయి.
హోండా జడ్ఆర్-వీ హైబ్రిడ్
హోండా తీసుకురానున్న జాబితాలో జడ్ఆర్-వీ కూడా ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా కంటే చాలా పెద్ద ఎస్‌యూవీ. దీని పొడవు 4,568 మి.మీ., వెడల్పు 1,840 మి.మీ., ఎత్తు 1,611 మి.మీ. ఈ ఎస్‌యూవీ వీల్‌బేస్ 2,655 మి.మీ.గా ఉంటుంది. భారత మార్కెట్ కోసం, ఈ ఎస్‌యూవీలో ఇంటర్నేషనల్ లెవల్లో ఉపయోగించే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది ఈ-సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కలిసి 180 హెచ్‌పీ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో హైబ్రిడ్ అసిస్టెన్స్, ఆల్-వీల్-డ్రైవ్ సెటప్ కూడా అందుబాటులో ఉండవచ్చు. అయితే, దీనిని కంప్లీట్లీ బిల్ట్-అప్ మోడల్‌గా తీసుకురావాలని హోండా ప్లాన్ చేస్తోంది, కాబట్టి దీని ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
సబ్-4 మీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
భారత మార్కెట్‌లోకి హోండా తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా లాంచ్ చేయనుంది. గతంలో ఎలివేట్ ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుందని భావించినా, హోండా కార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. భారత్ కోసమే మొదటి ఎలక్ట్రిక్ కారు ఏప్రిల్ 2026, మార్చి 2027 మధ్య లాంచ్ అవుతుందని, అది ఎలివేట్ కాదని ఆయన సూచించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు సబ్-4 మీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉండనుంది. ఇది మార్కెట్‌లో టాటా నెక్సాన్ ఈవీ, ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడనుంది.