Hyundai Creta EV : 39 నిమిషాల్లోనే 80% బ్యాటరీ ఫుల్..క్రెటా ఎలక్ట్రిక్ కస్టమర్లకు పండగే పండగ

క్రెటా ఎలక్ట్రిక్ కస్టమర్లకు పండగే పండగ

Update: 2026-01-28 13:44 GMT

Hyundai Creta EV : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పుడు మునుపటి కంటే వేగంగా ఛార్జ్ అవ్వడానికి సిద్ధమైంది. ఇంతకుముందు ఈ కారు గరిష్టంగా 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను మాత్రమే సపోర్ట్ చేసేది. దీనివల్ల బ్యాటరీ 10 శాతం నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి సుమారు 58 నిమిషాలు (దాదాపు గంట) పట్టేది. కానీ ఇప్పుడు కంపెనీ ఒక స్మార్ట్ అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై క్రెటా ఈవీ 100kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల అదే ఛార్జింగ్ స్థాయికి చేరుకోవడానికి కేవలం 39 నిమిషాలు సరిపోతుంది. అంటే దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది.

విశేషం ఏమిటంటే.. ఈ ఫీచర్ కోసం వినియోగదారులు సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్ లాగే, కారుకు కూడా ఓవర్-ద-ఎయిర్ అప్‌డేట్ లభిస్తుంది. కారులో ఉన్న ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిపోతుంది. హార్డ్‌వేర్ మార్చకుండానే కేవలం సాఫ్ట్‌వేర్ ద్వారా ఛార్జింగ్ సామర్థ్యాన్ని పెంచడం హ్యుందాయ్ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా కర్వ్ ఈవీ వంటి కార్లకు ఇది గట్టి సవాలు విసరనుంది.

క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 42kWh బ్యాటరీ వేరియంట్ 420 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ కలిగిన 51.4kWh వేరియంట్ ఒక్క ఛార్జింగ్‌తో ఏకంగా 510 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని పికప్ కూడా అదిరిపోతుంది. కేవలం 7.9 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు మోడ్లను ఇచ్చారు. అలాగే బ్రేక్ వేయకుండానే కారును నియంత్రించే ఐ-పెడల్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

ఈ కారు ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 42kWh మోడల్ ధర రూ.18.02 లక్షల నుంచి రూ.22.33 లక్షల వరకు ఉండగా, లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ.20 లక్షల నుంచి రూ.23.96 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వినియోగదారుల కోసం కంపెనీ 10 రకాల కలర్ ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో 3 మ్యాట్ ఫినిష్ రంగులు కూడా ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారును సెగ్మెంట్‌లోనే బెస్ట్‌గా నిలబెడుతున్నాయి. మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. V2V ఛార్జింగ్. దీని ద్వారా మీ కారు నుంచి మరో ఎలక్ట్రిక్ కారును కూడా ఛార్జ్ చేయవచ్చు.

Tags:    

Similar News