Toyota : టయోటా బంపర్ ఆఫర్..కేవలం రూ.29,499తో బేస్ మోడల్‌ను టాప్ ఎండ్‌గా మార్చుకోండి
కేవలం రూ.29,499తో బేస్ మోడల్‌ను టాప్ ఎండ్‌గా మార్చుకోండి
Toyota : ఆటోమొబైల్ రంగంలో 2025లో టయోటా కిర్లోస్కర్ మోటార్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. కస్టమర్ల అవసరాలను పసిగట్టి ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్లు ఇవ్వడంలో టయోటా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా తమ పాపులర్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కోసం ఒక ప్రత్యేకమైన టెక్ ప్యాకేజీని లాంచ్ చేసింది. దీని ధరను కేవలం రూ.29,499గా నిర్ణయించింది. సాధారణంగా లక్షలు పెట్టి టాప్ వేరియంట్ కొంటేనే లభించే ఫీచర్లను, ఇప్పుడు ఏ వేరియంట్ కస్టమర్ అయినా ఈ అదనపు ప్యాకేజీ ద్వారా పొందవచ్చు.
ఈ టెక్ ప్యాకేజీలో భద్రతతో పాటు కారుకు ప్రీమియం లుక్ ఇచ్చే పలు ఫీచర్లు ఉన్నాయి.
డ్యాష్‌క్యామ్ : నేటి కాలంలో రోడ్డు ప్రమాదాలు లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వీడియో ఆధారాలు చాలా ముఖ్యం. బయట మార్కెట్లో దొరికే డ్యాష్‌క్యామ్‌ల కంటే కంపెనీ ఇచ్చే అఫీషియల్ వెర్షన్ కారుకు ఖచ్చితంగా సెట్ అవుతుంది.
హెడ్-అప్ డిస్‌ప్లే : డ్రైవర్ రోడ్డు మీద నుంచి దృష్టి మళ్లించకుండా, కారు స్పీడ్, ఇతర సమాచారాన్ని విండ్‌షీల్డ్ మీదనే చూసుకునే వెసులుబాటు ఈ ఫీచర్ ద్వారా కలుగుతుంది.
యాంబియంట్ లైటింగ్: కారు లోపల మూడ్‌ను మార్చేలా రంగురంగుల లైటింగ్ సెటప్ ఈ ప్యాకేజీలో భాగం. ఇది కారుకు లగ్జరీ ఇంటీరియర్ ఫీల్‌ను ఇస్తుంది.
అదనపు హంగులు: ఈ ప్యాకేజీతో పాటు కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా వైర్‌లెస్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మెరుగైన మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా అదనంగా ఎంచుకోవచ్చు. డ్రైవింగ్ సమయంలో టైర్లలో గాలి ఎంత ఉందో ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద చూసుకోవడం వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. టయోటా డీలర్‌షిప్ వద్ద ఈ ప్యాకేజీని సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారాల తర్వాత టయోటా హైరైడర్ అత్యధిక అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. గత డిసెంబర్ నెలలోనే 7,022 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఈ తక్కువ ధర టెక్ ప్యాకేజీతో బేస్ వేరియంట్ కస్టమర్లను కూడా ఆకర్షించి, అమ్మకాల్లో అగ్రస్థానానికి చేరుకోవాలని టయోటా ప్లాన్ చేస్తోంది. రూ.30 వేల లోపే ఇన్ని ప్రీమియం ఫీచర్లు రావడం నిజంగా కస్టమర్లకు గొప్ప అవకాశమనే చెప్పాలి.