Electric Cars: నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది
| కొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది
Electric Cars: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి మరో కొత్త మోడల్ రాబోతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ దేశీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఓ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం HE1i కోడ్‌నేమ్‌తో తయారవుతున్న ఈ కారును Ioniq P పేరుతో తీసుకురావచ్చని ఆటోమొబైల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 26న వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. 2027 జనవరి 16న ఈ కారును ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే ఈ తేదీని హ్యుందాయ్ అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ధరలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
నాలుగు మీటర్లలోపు SUV.. బాక్సీ డిజైన్
ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ఇప్పటికే భారత రోడ్లపై పలుమార్లు టెస్టింగ్‌లో కనిపించింది. స్పై చిత్రాల ప్రకారం బాక్సీ డిజైన్, నిటారుగా ఉండే ముందు భాగం, చిన్న ఓవర్‌హ్యాంగ్స్, రూఫ్ రైల్స్, మందపాటి పిల్లర్లు ఇందులో ఉండొచ్చు. ముందు, వెనుక లైట్లకు ప్రత్యేకమైన డిజైన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రెండు భాగాలుగా ఉండే రూఫ్ స్పాయిలర్ కూడా కనిపించాయి. అయితే ఇవన్నీ టెస్టింగ్ వాహనాల ఆధారంగా వస్తున్న అంచనాలే. తుది డిజైన్‌ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
కొత్త ప్లాట్‌ఫామ్.. రెండు బ్యాటరీ ఆప్షన్లు?
ఈ కారును హ్యుందాయ్ E-GMP (K) ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తున్నట్లు ఆటోమొబైల్ నివేదికలు వెల్లడించాయి. విదేశాల్లో విక్రయించే హ్యుందాయ్ ఇన్ స్టర్ కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. కొత్త SUVలో స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రారంభ దశలో బ్యాటరీ సెల్స్‌ను Svolt నుంచి తీసుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఎక్సైడ్తో భాగస్వామ్యం ద్వారా స్థానికంగా తయారయ్యే బ్యాటరీ సెల్స్ వినియోగించే ప్రణాళిక ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, పూర్తి ఛార్జ్‌పై ప్రయాణించే దూరం, ఛార్జింగ్ సమయం వంటి వివరాలను హ్యుందాయ్ ఇంకా ప్రకటించలేదు.
కొత్త ఇన్ఫోటైన్మెంట్ టెక్నాలజీ
ఫీచర్ల విషయంలో ఈ కారుపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. హ్యుందాయ్ ఇప్పటికే Level 2 ADAS, కొత్త తరం ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థను ఇందులో అందించనున్నట్లు వెల్లడించింది. Pleos Connect సిస్టమ్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక నిర్ధారణ లేదు. ఈ SUVని తమిళనాడులోని శ్రిపెరంబుదూర్ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
టాటా నెక్సాన్ EVకి పోటీ తప్పదా?
మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ హ్యుందాయ్ SUVకి టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EV, కియా సైరోస్ EV నుంచి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా ధర, బ్యాటరీ వారంటీ, వాస్తవ పరిస్థితుల్లో లభించే రేంజ్, ఛార్జింగ్ సమయం ఈ కారుకు కీలకం కానున్నాయి. హ్యుందాయ్ విస్తృతమైన సేల్స్, సర్వీస్ నెట్వర్క్ కూడా దీనికి కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే ధర ఎంత ఉంటుంది? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? అనే వివరాలు వెల్లడైతేనే ఈ కారు మార్కెట్లో ఎంతటి ప్రభావం చూపుతుందో స్పష్టమవుతుంది.