MINI Cooper: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ భారత మార్కెట్లో కొత్త తరం కూపర్ SE ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.53.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మోడల్. ఇందులో ఫేవర్డ్ అనే ఒకే వేరియంట్ అందుబాటులో ఉంటుంది. బుకింగ్స్ దేశవ్యాప్తంగా మినీ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. కంపెనీ ప్రకటన ప్రకారం డెలివరీలు వెంటనే మొదలవుతాయి. ప్రత్యేకంగా బ్రిటిష్ డిజైనర్ పాల్ స్మిత్ పేరుతో రూపొందించిన కూపర్ SE పౌల్ స్మిత్ ఎడిషన్ ధర రూ.56.40 లక్షలు.

ఒక్క ఛార్జ్‌తో 402 కిలోమీటర్ల ప్రయాణం

ఈ కారులో 54.2 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. దీనికి ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ జత చేశారు. ఈ మోటార్ 218 hp పవర్, 330 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందు చక్రాలకు శక్తిని అందించే ఫ్రంట్ వీల్ డ్రైవ్ వ్యవస్థ ఉంది. కేవలం 6.7 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 402 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇది WLTP పరీక్షా ప్రమాణాల ఆధారంగా ప్రకటించిన రేంజ్.

30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్

ఛార్జింగ్ విషయంలోనూ ఈ కారులో వేగవంతమైన సదుపాయం ఉంది. 95 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. 11 kW AC ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటల 15 నిమిషాలు పడుతుంది. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ డ్రైవ్‌లకు ఉపయోగపడేలా ఛార్జింగ్ ఆప్షన్లు ఇచ్చారు.

9.4 అంగుళాల OLED స్క్రీన్.. ప్రీమియం ఫీచర్లు

డిజైన్ విషయంలో మినీ తన ప్రత్యేక గుర్తింపును కొనసాగించింది. గుండ్రటి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఆక్టాగనల్ గ్రిల్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఆకర్షణగా నిలుస్తాయి. లోపల 9.4 అంగుళాల గుండ్రటి OLED టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్, డిజిటల్ కీ వంటి సదుపాయాలు ఉన్నాయి. హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, హెడ్‌అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి.

Level 2 ADASతో భద్రత

భద్రత కోసం Level 2 ADAS టెక్నాలజీ ఇచ్చారు. ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ వార్నింగ్, రివర్సింగ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు డ్రైవర్‌కు సహాయపడతాయి. ABS, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ ఇండికేటర్ కూడా ఉన్నాయి. బ్రిటీష్ రేసింగ్ గ్రీన్, చిల్లీ రెడ్, ఓషియన్ వేవ్ గ్రీన్ రంగుల్లో ఈ కారు లభిస్తుంది. రెండు డోర్లతో కూడిన ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రత్యేకమైన డిజైన్ కోరుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది.

Tags: