Hyundai: హ్యుందాయ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. 2030 నాటికి భారత రోడ్లపై 26 కొత్త కార్లు
2030 నాటికి భారత రోడ్లపై 26 కొత్త కార్లు
Hyundai: ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకుని నిలబడేందుకు హ్యుందాయ్ తన వ్యూహాలకు పదును పెట్టింది. 2026 సిఈఓ ఇన్వెస్టర్ డే సమావేశంలో కంపెనీ కీలక విషయాలను వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ కొత్త మోడళ్లను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 26 మోడళ్లను కేవలం భారతీయ కస్టమర్ల కోసమే కేటాయించడం విశేషం. చైనీస్ కార్ల తయారీ కంపెనీల నుంచి పెరుగుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడంతో పాటు, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల విభాగాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
రూ. 45 వేల కోట్ల పెట్టుబడి, స్థానిక ఉత్పత్తికి పెద్దపీట
కేవలం కొత్త కార్లను అందుబాటులోకి తేవడమే కాకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఊహించని రీతిలో పెంచేందుకు హ్యుందాయ్ చర్యలు చేపట్టింది. 2030 నాటికి భారత్‌లో ఏడాదికి అదనంగా 3.20 లక్షల వాహనాలను తయారు చేసేలా ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించనుంది. వాహనాల్లో ఉపయోగించే విడిభాగాల్లో 90 శాతానికి పైగా భాగాలను స్వదేశంలోనే తయారు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. దీనికోసం దాదాపు 1,400 మందికి పైగా సప్లయర్లు, 900 మందికి పైగా భారతీయ ఇంజనీర్లతో కలిసి పని చేస్తోంది. భారత్‌లో రూ. 45,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ఇదివరకే ప్రకటించిన కంపెనీ, మన దేశాన్ని ప్రపంచంలోనే తన రెండో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా మార్చి ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు పెంచనుంది.
భారత్ కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
భారతదేశ రహదారులు, ఇక్కడి కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా ప్రత్యేకంగా ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని హ్యుందాయ్ రూపొందిస్తోంది. ఈ నూతన మోడల్ 2026 చివరి త్రైమాసికంలో మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇందులో అధునాతన నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, లెవెల్-2 ఎడాస్ రక్షణ ఫీచర్లు ఉండనున్నాయి. దీనితో పాటు ఒక మిడ్-సైజ్ పెట్రోల్ ఎస్‌యూవీని కూడా తీసుకొస్తోంది. 2030 నాటికి భారత్‌లో తమ మొత్తం విక్రయాల్లో ఎస్‌యూవీల వాటానే 80 శాతం వరకు ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.
హైబ్రిడ్, ఇఆర్‌ఈవి వాహనాలపై ప్రత్యేక దృష్టి
కేవలం పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా హైబ్రిడ్, ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడళ్లపై కూడా హ్యుందాయ్ దృష్టి సారిస్తోంది. 2025 నాటికి గ్లోబల్ సేల్స్‌లో 23 శాతంగా ఉన్న విద్యుత్ వాహనాల వాటాను 2030 నాటికి 60 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాబోయే 8 నెలల కాలంలోనే గ్లోబల్ మార్కెట్లో 7 సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. భారత్‌ను కీలక విపణిగా మార్చుకుంటూ హ్యుందాయ్ వేస్తున్న ఈ అడుగులు దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని సరికొత్త మలుపు తిప్పనున్నాయి. రాబోయే రోజుల్లో వాహనదారులకు మరింత అత్యాధునిక సాంకేతికతతో కూడిన కార్లు అందుబాటులోకి రావడం ఖాయం.