Hyundai : హ్యుందాయ్ నుండి 26 కొత్త మోడల్స్.. 2027లో మొత్తం హవా ఈ కంపెనీదే
2027లో మొత్తం హవా ఈ కంపెనీదే
Hyundai : హ్యుందాయ్ మోటార్ ఇండియా రాబోయే ఐదేళ్లలో భారత మార్కెట్లో తమ పట్టును బలోపేతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. కంపెనీ లక్ష్యం ఏమిటంటే.. 2025 నుండి 2030 మధ్యకాలంలో 26 కొత్త మోడళ్లను విడుదల చేయడం. ఇందులో పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్‌జీ.. ఇలా అన్ని రకాల ఆప్షన్లు ఉంటాయి. ఈ వ్యూహం అన్ని రకాల వినియోగదారుల అవసరాలను తీర్చడం, వేగంగా మారుతున్న ఆటో మార్కెట్‌లో తమ స్థానాన్ని నిలుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
హ్యుందాయ్ ఒక కొత్త ఎంపీవీ కుటుంబాల కోసం, ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడే వారి కోసం ఒక ఎస్‌యూవీ, పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ని తీసుకురాబోతున్నట్లు ధృవీకరించింది. కంపెనీ మొదటి స్థానికంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2027లో విడుదల కానుంది. కొత్త హ్యుందాయ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది.. స్టాండర్డ్ రేంజ్ (పట్టణ వినియోగం కోసం), లాంగ్ రేంజ్ (హైవే డ్రైవింగ్ కోసం). ఈ ఈవీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్, లెవెల్-2 ఏడిఏఎస్, సూపర్ స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చెన్నై ప్లాంట్‌లో తయారవుతుంది, అయితే ఈవీ సప్లై చైన్ రెండు దశల్లో దేశీయంగా మారుతుంది. తద్వారా భారతదేశంలోనే విడి భాగాలు తయారవుతాయి.
హ్యుందాయ్ రాబోయే సంవత్సరాల్లో 8 కొత్త హైబ్రిడ్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు కూడా తెలిపింది. దీనితో కంపెనీ 52% ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో పర్యావరణ అనుకూలమైనది అవుతుంది. పెరుగుతున్న హైబ్రిడ్ వాహనాల డిమాండ్, ఏప్రిల్ 2025 నుండి అమలులోకి రానున్న సీఏఎఫ్‌ఈ 3 నార్మ్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చర్య తీసుకున్నారు. హ్యుందాయ్ రాబోయే మాస్-మార్కెట్ హైబ్రిడ్ మోడల్స్‌లో కొత్త 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. దీనిని భారతదేశంలోనే అభివృద్ధి చేస్తారు.
ఈ ఇంజిన్ ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో ఇంజిన్‌ల కంటే మరింత పవర్ఫుల్ అవుతుంది. దీనిని ఈసీవీటీ లేదా డీసీటీ గేర్‌బాక్స్‌తో కలిపి అందిస్తారు. 2027లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ కంపెనీ మొదటి హైబ్రిడ్ కారు అవుతుంది. ఆ తర్వాత అదే సంవత్సరంలో మూడు వరుసల సీట్లు ఉన్న ఎన్ఐ1ఐ ఎస్‌యూవీ హైబ్రిడ్, 2028లో హ్యుందాయ్ పాలిసేడ్ హైబ్రిడ్ ను పరిచయం చేస్తారు. హ్యుందాయ్ ఈ రోడ్‌మ్యాప్ భారతదేశంలోని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల మార్కెట్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది.