Pod Taxi : ముంబై రోడ్లపై అద్భుతం.. డ్రైవర్ లేని కార్లు గాల్లో తేలుతూ వచ్చేస్తున్నాయి
డ్రైవర్ లేని కార్లు గాల్లో తేలుతూ వచ్చేస్తున్నాయి
Pod Taxi : ముంబై మహానగరంలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భారత్ లోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్ పాడ్ టాక్సీ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేవలం సినిమాల్లో మాత్రమే చూసే ఈ అత్యాధునిక రవాణా సౌకర్యం త్వరలోనే ముంబై వాసులకు అందుబాటులోకి రానుంది. ముంబైలోని BKC ప్రాంతం కార్పొరేట్ ఆఫీసులకు నిలయం. వేల సంఖ్యలో ఉద్యోగులు ఇక్కడికి వస్తుంటారు. అయితే మెట్రో లేదా రైల్వే స్టేషన్ నుంచి ఆఫీసులకు వెళ్లడానికి గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా డ్రైవర్‌లెస్ పాడ్ టాక్సీ సిస్టమ్ ను తీసుకువస్తున్నారు. ఇవి చిన్నపాటి ఎలక్ట్రిక్ వాహనాలు, ఇవి డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు, అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ప్రత్యేకమైన ట్రాక్ పై నడుస్తాయి.
ఈ భారీ ప్రాజెక్టును దాదాపు రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌లో నిర్మిస్తున్నారు. మొదటి దశలో 3 నుంచి 3.5 కిలోమీటర్ల మేర BKC లోని మెట్రో స్టేషన్లను, వ్యాపార ప్రాంతాలను కలుపుతారు. ఆ తర్వాత దీనిని 8 నుంచి 9 కిలోమీటర్ల మేర విస్తరించి, మొత్తం BKC ఏరియాను ఒకే గొడుగు కిందకు తెస్తారు. మొత్తం 22 ఎయిర్ కండిషన్డ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 200 మీటర్లకు ఒక స్టేషన్ ఉండటం వల్ల ప్రయాణికులు ఎక్కడికైనా సులభంగా చేరుకోవచ్చు.
ఈ పాడ్ టాక్సీలలో ఒకేసారి 4 నుంచి 6 మంది కూర్చుని ప్రయాణించవచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వాహనాలు పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి, కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. వీటిలోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇవి ప్రతి స్టేషన్ లో ఆగవు. ప్రయాణికుడు ఏ స్టేషన్ కు వెళ్లాలో ముందే సెట్ చేసుకుంటే, నేరుగా అక్కడికే తీసుకెళ్తాయి. దీనివల్ల ప్రయాణ సమయం బాగా ఆదా అవుతుంది.
సాధారణ బస్సులు లేదా మెట్రోల కోసం నిమిషాల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ప్రతి 15 నుంచి 30 సెకన్లకు ఒక పాడ్ అందుబాటులో ఉండేలా సిస్టమ్ ను డిజైన్ చేస్తున్నారు. బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో వీటికి సంబంధించి ఒక ప్రత్యేక డిపోను కూడా నిర్మించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ గనుక సక్సెస్ అయితే, ముంబైలోని ఇతర రద్దీ ప్రాంతాలతో పాటు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా పాడ్ టాక్సీలు వచ్చే అవకాశం ఉంది.