Insurance Crisis : రోడ్లపై మృత్యుపాశాలు.. దేశంలో 44 శాతం వాహనాలకు ఇన్సూరెన్స్ లేదట

దేశంలో 44 శాతం వాహనాలకు ఇన్సూరెన్స్ లేదట

Update: 2026-03-14 10:06 GMT

Insurance Crisis : భారతదేశ రహదారులపై ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోందా? తాజా గణాంకాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో తిరుగుతున్న వాహనాల్లో దాదాపు సగం వాహనాలకు అసలు ఇన్సూరెన్స్ లేదన్న షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో సమర్పించిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 44 శాతం వాహనాలు ఎటువంటి బీమా రక్షణ లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. అంటే, మన పక్కన వెళ్తున్న ప్రతి రెండు వాహనాల్లో ఒకదానికి ఇన్సూరెన్స్ లేదన్నమాట. ఈ నిర్లక్ష్యం రోడ్డు ప్రమాద బాధితులకు అందాల్సిన పరిహారం విషయంలో పెను సవాళ్లను విసురుతోంది.

రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వివరాలను వెల్లడించారు. వాహన్ డేటాబేస్ ఆధారంగా మార్చి 6, 2026 నాటికి ఉన్న లెక్కల ప్రకారం.. కోట్లాది వాహనాలు ఇన్సూరెన్స్ గడువు ముగిసినా పునరుద్ధరించుకోలేదని తేలింది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ఏ వాహనానికైనా కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి. చట్టంలోని సెక్షన్ 146 దీనిని నిర్బంధం చేయగా, సెక్షన్ 196 ప్రకారం ఇన్సూరెన్స్ లేని వాహనాన్ని నడపడం నేరం. దీనికి జరిమానాతో పాటు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సాధారణంగా ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. కానీ ఇన్సూరెన్స్ లేని వాహనం వల్ల ప్రమాదం జరిగితే, సదరు యజమాని నుంచి పరిహారం వసూలు చేయడం బాధితులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు డిజిటల్ వెరిఫికేషన్ టెక్నాలజీని వాడాలని, నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పెట్రోల్ బంకులు లేదా టోల్ ప్లాజాల వద్దే ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించే వ్యవస్థపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

అయితే, ఇన్సూరెన్స్ లేని వాహనాల వల్ల దెబ్బతిన్న బాధితులకు ప్రభుత్వం ఒక చిన్న వెసులుబాటు కల్పించింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 164 మరియు 166 కింద బాధితులు పరిహారం కోసం క్లెయిమ్ చేయవచ్చు. అలాగే హిట్ అండ్ రన్ కేసులు లేదా ఇన్సూరెన్స్ లేని వాహనాల వల్ల జరిగే ప్రమాదాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మోటారు వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా బాధితుల చికిత్సకు, తక్షణ సహాయానికి నిధులు అందుతాయి. అయినప్పటికీ, వాహనదారులు తమ బాధ్యతగా ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల అటు తమకు, ఇటు ఇతరులకు రక్షణ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News