Electric Cars: ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి సంచలన ప్రవేశానికి సిద్ధమవుతోంది. రాబోయే 2027 సంవత్సరంలో కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో అత్యంత ఆకర్షణీయమైన రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ మోడల్స్ ఉండనున్నాయి. వీటితో పాటు సరికొత్త జాగ్వార్ జీటీ కారును కూడా భారతీయ కస్టమర్ల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో లగ్జరీ ఈవీల డిమాండ్ వేగంగా పెరుగుతుండటంతో జేఎల్‌ఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

తొలి దశలో విదేశాల నుంచి కార్ల దిగుమతి

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల పట్ల వినియోగదారుల స్పందన ఎలా ఉంటుందనేది పరిశీలించేందుకు కంపెనీ తొలుత విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసి విక్రయించనుంది. జేఎల్‌ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సీఈఓ రాజన్ అంబా మాట్లాడుతూ.. భారత్ తమకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కీలక మార్కెట్ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఈవీ కార్లు లేనప్పటికీ, భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని ఆయన స్పష్టం చేశారు. అయితే భారతీయ కస్టమర్లు ఈ కొత్త మోడళ్లను ఏ విధంగా స్వీకరిస్తారనేది ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఛార్జింగ్ సవాళ్లు అలాగే రీసేల్ వాల్యూపై దృష్టి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగం పుంజుకుంటున్నప్పటికీ, కొన్ని సవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా నగరాలు, హైవేలపై తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం, అలాగే సెకండ్ హ్యాండ్‌లో ఈవీలను విక్రయించేటప్పుడు మంచి రేటు రాకపోవడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశాలుగా ఉన్నాయి. కస్టమర్లలో ఈ సమస్యలపై భరోసా కల్పించడం చాలా అవసరమని, అయితే రాబోయే రోజుల్లో ఈ మౌలిక వసతులు క్రమంగా మెరుగుపడుతున్నాయని జేఎల్‌ఆర్ వెల్లడించింది.

పెరుగుతున్న రిటైల్ కేంద్రాలు

ఎలక్ట్రిక్ కార్ల ప్రవేశంతో పాటు దేశవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని కంపెనీ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా 2026 చివరి నాటికి దేశంలో జేఎల్‌ఆర్ రిటైల్ కేంద్రాల సంఖ్యను 40కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఈ సంఖ్య కేవలం 25గా ఉండేది. మరోవైపు ప్రముఖ 'డిఫెండర్' బ్రాండ్ కార్లను స్థానికంగానే అసెంబ్లింగ్ చేయడం ద్వారా తయారీ ఖర్చులు తగ్గి ఆర్డర్లు సుమారు 20 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ రూపంలో ఆదా అయ్యే మొత్తాన్ని ధరల తగ్గింపు రూపంలో కస్టమర్లకు అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

Tags: