Upcoming Cars: భారతదేశంలో సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కార్ల కొనుగోలుదారులకు వచ్చే ఏడాది పండగ వాతావరణం కనిపించనుంది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, కియా, అలాగే మహీంద్రా సంస్థలు తమ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నాయి. నెక్సాన్ నూతన తరం మోడల్, రెండో తరం కియా సొనెట్, అలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా విజన్ ఎస్ ప్రొడక్షన్ వెర్షన్ 2027 తొలి అర్ధభాగంలో రోడ్లపైకి రానున్నాయి. ఆధునిక డిజైన్లు, మెరుగైన స్థలం, అత్యాధునిక భద్రతా హంగులతో ఈ కార్లు మార్కెట్లో పోటీని తారాస్థాయికి చేర్చనున్నాయి.

ప్రాజెక్ట్ గరుడ్ పేరిట రానున్న నెక్సాన్

టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎస్‌యూవీని పూర్తిగా మార్చి కొత్త రూపంలో తీసుకువస్తోంది. కంపెనీ ఇంటర్నల్‌గా దీనికి 'ప్రాజెక్ట్ గరుడ్' అనే కోడ్‌నేమ్ కేటాయించింది. దీని అంచనా ధర రూ. 8 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య ఉండవచ్చు. 2027 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచి అదే ఏడాది మధ్య నాటికి మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత X1 ప్లాట్‌ఫారమ్‌కు బదులుగా ఈసారి కర్వ్ మోడల్‌లో వాడిన అత్యాధునిక అట్లాస్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించనున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో పాటు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఇందులో లభించనుంది.

విశాలమైన కేబిన్‌తో కియా సొనెట్

కొరియన్ ఆటో దిగ్గజం కియా తన విజయవంతమైన సొనెట్ ఎస్‌యూవీకి సెకండ్ జెନరేషన్ మోడల్‌ను పరిచయం చేస్తోంది. రూ. 8 లక్షల నుంచి రూ. 17 లక్షల ధరల శ్రేణిలో 2027 మొదటి త్రైమాసికంలో ఇది షోరూమ్‌లకు రానుంది. గత మోడల్‌లో వినియోగదారులు ఎదుర్కొన్న వెనుక సీట్ల స్పేస్ సమస్యను పూర్తిగా పరిష్కరించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. పెద్ద డ్యూయల్-స్క్రీన్ డిస్‌ప్లే, ఓటీఏ అప్‌డేట్లు, ఆరు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు లెవెల్-2 ఏడీఏఎస్ (ADAS) భద్రతా ఫీచర్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భవిష్యత్తులో దీనికి హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా విజన్ ఎస్

మహీంద్రా సంస్థ నుంచి రానున్న విజన్ ఎస్ కాన్సెప్ట్ ఆధారిత ఎస్‌యూవీపై ఆటో ప్రియుల్లో భారీ అంచనాలున్నాయి. దీని బాక్సీ లుక్ కారణంగా అంతా దీనిని మినీ స్కొర్పియో అని పిలుస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి 2027 నాటికి ఇది లాంచ్ కానుండగా, దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండవచ్చు. మహీంద్రాకు చెందిన సరికొత్త ఎన్‌యూ-ఐక్యూ (NU_IQ) మోనోకాక్ ప్లాట్‌ఫారమ్‌పై రానున్న తొలి ఎస్‌యూవీ ఇదే. సెగ్మెంట్‌లో అత్యధికంగా 2,665 మిమీ వీల్ బేస్ కలిగి ఉండటం వల్ల కేబిన్లో కాళ్లు చాపుకుని కూర్చునేందుకు ఎంతో విశాలమైన స్థలం లభిస్తుంది.

Tags: