Car Tech: స్క్రీన్లు పెరిగితే కష్టాలు తప్పవా? కొత్త కార్లలో ఆ ఫీచర్ వల్ల నరకం చూస్తున్న వాహనదారులు
నరకం చూస్తున్న వాహనదారులు
Car Tech: కారంటే కేవలం నడపడానికి మాత్రమే కాదు.. డ్యాష్‌బోర్డ్ నిండా పెద్ద పెద్ద స్క్రీన్లు ఉండాల్సిందే అని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ మోజుతో ఒకటికి రెండు, రెండుకి మూడు స్క్రీన్లు పెట్టేస్తున్నాయి. ఆడంబరంగా కనిపించే ఈ డిస్‌ప్లేలు కస్టమర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు ప్రముఖ అధ్యయనం జేడీ పవర్ షాకింగ్ నిజాలను వెల్లడించింది.
హంగామా ఎక్కువ.. ఉపయోగం తక్కువ!
ఇటీవలి కాలంలో వస్తున్న కొత్త కార్లలో మూడు స్క్రీన్లు ఇవ్వడం ఒక ఫ్యాషన్‌గా మారింది. డ్రైవర్ ముందర ఉన్న డిజిటల్ మీటర్, మధ్యలో ఉండే మెయిన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు పక్కన కూర్చునే ప్రయాణికుడి కోసం ప్రత్యేకంగా ప్యాసింజర్ డిస్‌ప్లే అందిస్తున్నారు. ప్రయాణంలో వినోదం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీలు చెబుతున్నప్పటికీ, రియల్ లైఫ్‌లో మాత్రం అత్యంత చెత్త అనుభవాన్ని ఇస్తోంది. జేడీ పవర్ నిర్వహించిన 2026 నాటి అధ్యయనంలో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చిన ఫీచర్‌గా ఈ ప్యాసింజర్ డిస్‌ప్లే నిలిచింది. ప్రతి 100 కార్లలో సగటున 21.3 సమస్యలు ఈ స్క్రీన్ల వల్లే వస్తున్నట్లు తేలింది.
ఎక్కువ డిస్‌ప్లేలు ఉంటే ఇన్ఫోటైన్‌మెంట్ క్రాష్
ప్యాసింజర్ స్క్రీన్లు ఉన్న వాహనాల్లో మొత్తం ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థే పదే పదే హ్యాంగ్ అవ్వడం, సాంకేతిక లోపాలు తలెత్తడం జరుగుతోంది. స్క్రీన్లు ఎక్కువగా ఉండటం వల్ల డ్రైవర్ శ్రద్ధ పక్కకు మళ్లడమే కాకుండా, కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. హంగూ ఆర్భాటాల కోసం ఇచ్చే ఈ ఫీచర్లను కేవలం 6 శాతం మంది మాత్రమే సరిగ్గా ఉపయోగిస్తుండగా, మిగిలిన వారు వీటిని ఒక అనవసరమైన భారంలా భావిస్తున్నారు. ప్రయాణికుల కోసం ఇచ్చే స్క్రీన్ల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని వాహనదారులు వాపోతున్నారు.
సింపుల్ టెక్నాలజీకే కస్టమర్లు జై
ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోయే టెక్నాలజీకే వాహనదారులు అత్యధిక మార్కులు వేస్తున్నారు. స్మార్ట్ ఇగ్నిషన్ సిస్టమ్ లాంటి సింపుల్ టెక్నాలజీలలో ప్రతి 100 కార్లలో కేవలం 2.4 సమస్యలు మాత్రమే నమోదయ్యాయి. స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ సీట్ అడ్జస్ట్‌మెంట్ లాంటి డ్రైవింగ్ సులభతరం చేసే ఫీచర్లను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. స్క్రీన్లపై పదే పదే టచ్ చేస్తూ సమయాన్ని వృథా చేయడం కంటే, కార్లలో దానంతట అదే సెట్ అయ్యే ఆటోమేటిక్ ఫీచర్లే డ్రైవింగ్‌ను సేఫ్‌గా మారుస్తాయని స్పష్టమవుతోంది.
అడ్వాన్స్డ్ అడాస్ ఉంటే సరిపోదు
కేవలం స్క్రీన్లే కాకుండా సేఫ్టీ కోసం ఇచ్చే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. లెవెల్ 2 ప్లస్ అంటూ ఎక్కువ ఫీచర్లు ఇచ్చే సిస్టమ్‌ల కంటే, సింపుల్‌గా ఉండే సాంప్రదాయ లెవెల్ 2 అడాస్‌తోనే డ్రైవర్లు సురక్షితంగా భావిస్తున్నారు. కారు మొత్తం నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోవడం కంటే, ప్రమాదం జరిగే సమయంలో హెచ్చరించే ఫీచర్లకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. టెక్నాలజీ బ్రాండ్ల విషయానికొస్తే హ్యుందాయ్ వరుసగా ఏడోసారి అత్యుత్తమ టెక్నాలజీ బ్రాండ్‌గా అగ్రస్థానంలో నిలవడం విశేషం.