MG Motors : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1100 కిలోమీటర్లు.. మార్కెట్ పై ఏకంగా ఎంజీ నుంచి ఆరు కొత్త కార్ల దాడి

మార్కెట్ పై ఏకంగా ఎంజీ నుంచి ఆరు కొత్త కార్ల దాడి

Update: 2026-02-17 08:06 GMT

MG Motors : భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఒక సంచలనం సృష్టిస్తోంది. విండ్‌సర్ ఈవీ భారీ విజయంతో ఇప్పటికే దేశంలో రెండో అతిపెద్ద ఈవీ తయారీదారుగా ఎదిగిన ఎంజీ మోటార్, ఇప్పుడు తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో ఏకంగా 6 కొత్త కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఇందులో కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా, సరికొత్త టెక్నాలజీతో కూడిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలు కూడా ఉండటం విశేషం.

ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాదిలో కంపెనీ ప్రధానంగా మూడు కీలక మోడళ్లను లాంచ్ చేయనుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మెజస్టర్. ఇది టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిచ్చేలా ఏప్రిల్-మే నెలల్లో విడుదల కానుంది. దీనితో పాటు ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు, మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు రాబోతున్నాయి.

భారతదేశంలో మాస్ మార్కెట్ కోసం ఎంజీ తీసుకువస్తున్న మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు ప్రాజెక్ట్ 520. ఇది చైనాలో బాగా పాపులర్ అయిన వులింగ్ స్టార్‌లైట్ 560 ఎస్‌యూవీపై ఆధారపడి ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5 kWh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఇది 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇక పెట్రోల్ ఇంజిన్ కూడా కలిపితే ఏకంగా 1100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.

కొత్త కార్లను తీసుకురావడమే కాకుండా, తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంజీ భారీ పెట్టుబడులను పెడుతోంది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.2 లక్షల యూనిట్ల నుంచి ఏకంగా 3 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం దాదాపు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు వెచ్చించనుంది. భవిష్యత్తులో తమ అమ్మకాల్లో 75-80 శాతం కేవలం న్యూ ఎనర్జీ వెహికల్స్ (హైబ్రిడ్, ఈవీలు) నుంచే రావాలని ఎంజీ పక్కా ప్లాన్‌తో ఉంది.

Tags:    

Similar News