JSW : క్రెటా ఈవీకి దడ మొదలైంది.. వస్తోంది జెఎస్‌డబ్ల్యూ జెకో జె5 ఎస్‌యూవీ
వస్తోంది జెఎస్‌డబ్ల్యూ జెకో జె5 ఎస్‌యూవీ
JSW : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు ఆ క్రెటా ఈవీకి గట్టి పోటీనిచ్చేందుకు JSW మోటార్స్ నడుం బిగించింది. చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ చెరీ భాగస్వామ్యంతో వస్తున్న జెకో జె5 ఆధారిత సరికొత్త ఎస్‌యూవీని పుణే వీధుల్లో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ తన ఎలక్ట్రిఫికేషన్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.
ఈ కొత్త జెఎస్‌డబ్ల్యూ ఎస్‌యూవీ కేవలం చూడటానికే కాదు, ఫీచర్ల పరంగా కూడా చాలా రిచ్‌గా ఉండబోతోంది. ఇందులో 14.8-అంగుళాల భారీ వర్టికల్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఎక్కడా తగ్గకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 540-డిగ్రీల కెమెరా సిస్టమ్, లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో జెకో బ్రాండింగ్‌తో అమ్ముడవుతున్న ఈ కారు, ఇండియాలో జెఎస్‌డబ్ల్యూ పేరుతో సందడి చేయనుంది.
జెకో J5 గ్లోబల్ వెర్షన్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఏకంగా 221 BHP పవర్‌ను, 295 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 18.8 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్ విషయానికి వస్తే.. ఇందులో 58.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను వాడారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 402 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని మోటార్ 211 PS పవర్, 288 Nm టార్క్‌తో కారును రాకెట్‌లా దూకించగలదు.
JSW మోటార్స్ తన తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఏర్పాటు చేస్తోంది. 2026 ఆగస్టు నుంచి ఇక్కడ కార్ల అసెంబ్లింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లను లాంచ్ చేసి, ఆ తర్వాత ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. టాటా కర్వ్ ఈవీ, మారుతి ఈ విటారా, హ్యుందాయ్ క్రెటా ఈవీలకు ఈ కారు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.