Hyundai Creta: భారత మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా హవా.. మరోసారి నంబర్-1 ఎస్‌యూవీగా రికార్డ్
మరోసారి నంబర్-1 ఎస్‌యూవీగా రికార్డ్
Hyundai Creta: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. జూలై 2026లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ ఎస్‌యూవీగా క్రెటా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జూలై నెలలో ఏకంగా 18,088 మంది వినియోగదారులు కొత్త క్రెటా ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. గతేడాది జూలై 2025లో నమోదైన 16,898 యూనిట్లతో పోలిస్తే ఇది సంవత్సర ప్రాతిపదికన 7.0 శాతం వృద్ధిని నమోదు చేసింది.
టాప్-10 మిడ్-సైజ్ ఎస్‌యూవీల సేల్స్ వివరాలు
ఈ సేల్స్ చార్ట్‌లో మహీంద్రా స్కార్పియో 16,009 యూనిట్ల విక్రయాలు (16.5% వృద్ధి) సాధించి రెండో స్థానంలో నిలిచింది. కియా సెల్టోస్ 108.7 శాతం భారీ వృద్ధితో 12,541 యూనిట్లను విక్రయించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత నూతన మారుతి సుజుకి విక్టోరిస్ 11,334 యూనిట్లతో నాలుగో స్థానంలో, మహీంద్రా థార్ 10,558 యూనిట్లతో (7.2% వృద్ధి) ఐదో స్థానంలో నిలిచాయి.
ఆ తర్వాత స్థానాల్లో మహీంద్రా బొలేరో 9,336 యూనిట్లు (24.3% వృద్ధి), మహీంద్రా XUV 7XO 8,233 యూనిట్లు (16.7% వృద్ధి) అమ్ముడయ్యాయి. ఎనిమిదో స్థానంలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా 8,127 యూనిట్లు (27.5% వృద్ధి) సాధించగా, తొమ్మిదో స్థానంలో టయోటా హైరైడర్ 7,187 యూనిట్లు (18.5% తగ్గుదల) సాధించింది. పదో స్థానంలో టాటా సియెర్రా 6,327 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది.
హ్యుందాయ్ క్రెటా సక్సెస్‌కు కారణాలు
హ్యుందాయ్ క్రెటా వినియోగదారులను అంతగా ఆకట్టుకోవడానికి దానిలోని అత్యాధునిక ఫీచర్లు ప్రధాన కారణం. ఈ ఎస్‌యూవీ కేబిన్ లోపల 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 70 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను అందించారు.
ఇంజిన్ ఆప్షన్లు, ధరలు
క్రెటా మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. భారత మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.91 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ ధరకు వచ్చేసరికి రూ.20.11 లక్షల వరకు ఉంది.