Kia Sonet : అక్టోబర్ నెలలో ధూమ్ ధామ్.. కారెన్స్, సెల్టోస్‌ను దాటి నంబర్-1 స్థానంలో కియా సోనెట్
కారెన్స్, సెల్టోస్‌ను దాటి నంబర్-1 స్థానంలో కియా సోనెట్
Kia Sonet : భారతీయ మార్కెట్‌లో దూసుకుపోతున్న కియా ఇండియా కంపెనీ అక్టోబర్ నెల సేల్స్ లెక్కలు బయటపడ్డాయి. ఈసారి కూడా కియా కంపెనీకి సోనెట్ మోడల్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచి, నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు కియా టాప్-3 మోడల్స్ అయిన సోనెట్, కారెన్స్, సెల్టోస్ అన్నీ కూడా ఈ సంవత్సరంలోనే అత్యధికంగా అమ్ముడవడం విశేషం. ఈ రికార్డు సేల్స్ కారణంగా కియా అక్టోబర్‌లో మొత్తం 29,556 కార్లను అమ్మి, తన గత రికార్డులను అధిగమించింది. మొత్తం అమ్మకాల్లో 29.9% భారీ వృద్ధిని సాధించింది.
కియా సేల్స్ బ్రేకప్‌లో సోనెట్ సత్తా చాటింది. ఈ చిన్న ఎస్‌యూవీ అక్టోబర్ 2025లో ఏకంగా 12,745 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది (అక్టోబర్ 2024)లో 9,699 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే, సోనెట్ అమ్మకాలు ఏకంగా 31.41% పెరిగాయి. కియా మొత్తం అమ్మకాల్లో 43.12% వాటా సోనెట్ దే కావడం విశేషం. కియాకు బాగా అమ్ముడయ్యే కారెన్స్, సెల్టోస్ కంటే సోనెట్‌నే కస్టమర్లు ఎక్కువగా కొంటున్నారు.
సోనెట్ తర్వాత కారెన్స్ క్లావిస్ ఈవీ మోడల్ రెండో స్థానంలో నిలిచింది. 7-సీటర్ కారు అయిన కారెన్స్ అక్టోబర్ 2025లో 8,779 యూనిట్లు అమ్ముడై, 37.52% వృద్ధిని నమోదు చేసింది. ఇది కంపెనీ అమ్మకాల్లో 29.7% వాటాను కలిగి ఉంది. ఇక కియా స్టార్ మోడల్ సెల్టోస్ మూడో స్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో దీని అమ్మకాలు 7,130 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గతేడాదితో పోలిస్తే 12.02% వృద్ధిని సాధించింది.
కియా కొత్తగా ప్రవేశపెట్టిన సిరోస్ మోడల్ 7,850 యూనిట్లు అమ్ముడై మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇక ప్రీమియం మోడల్ అయిన కార్నివాల్ మాత్రం అమ్మకాల్లో వెనుకబడింది. అక్టోబర్ 2025లో కేవలం 116 యూనిట్లు మాత్రమే అమ్ముడై, గత ఏడాదితో పోలిస్తే 54.51% నష్టాన్ని చవిచూసింది. ఎలక్ట్రిక్ కార్లలో EV9 ఒక యూనిట్ అమ్ముడవగా, EV6 అమ్మకాలు మాత్రం సున్నాగా ఉన్నాయి (గత ఏడాది 50 యూనిట్లు అమ్ముడయ్యాయి). మొత్తంగా, కియా అక్టోబర్ 2025లో 29,556 యూనిట్లు అమ్మి, గతేడాదితో పోలిస్తే 29.9% బలమైన వృద్ధిని సాధించి, రికార్డు సృష్టించింది.