Kia: సేల్స్‌లో కియా సరికొత్త చరిత్ర.. సెప్టెంబర్‌లో 32 వేల కార్ల విక్రయాలతో రికార్డు
విక్రయాలతో రికార్డు
Kia: భారత ఆటోమొబైల్ రంగంలో దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియా ఇండియా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 2026 సెప్టెంబర్ నెలలో కంపెనీ మొత్తం 32,017 వాహనాలను విక్రయించి సంచలనం సృష్టించింది. 2025 సెప్టెంబర్ విక్రయాలతో పోలిస్తే ఇది ఏకంగా 41 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తోంది. ఈ కాలంలో కంపెనీ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ప్రీమియం ఎస్‌యూవీ కియా సొరెంటో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది. సెప్టెంబర్ నెలలోనే 1,739 యూనిట్ల సొరెంటో కార్లు అమ్ముడై కంపెనీ అత్యధిక విక్రయాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది.
కియా సొరెంటో లాంచ్, మార్కెట్ రెస్పాన్స్
భారత మార్కెట్లో కియా సొరెంటో ఎస్‌యూవీని 2026 సెప్టెంబర్ 4వ తేదీన అధికారికంగా విడుదల చేశారు. లాంచ్ అయిన మొదటి నెలలోనే ఈ కారుకు మార్కెట్లో ఊహించని డిమాండ్ లభించింది. ఆగస్టు నెలలో డీలర్లకు పంపిన 365 యూనిట్లతో పాటు సెప్టెంబర్ సేల్స్ కలుపుకుని మొత్తం డిస్పాచ్ సంఖ్య 2,104 యూనిట్లకు చేరింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 27.99 లక్షల నుంచి రూ. 40.39 లక్షల పరిధిలో ఉంది. అద్భుతమైన డిజైన్, ప్రీమియం కేబిన్ స్పేస్, మెరుగమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఎస్‌యూవీని రూపొందించారు.
పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, హంగులు
కియా సొరెంటో మోడల్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ కాగా, ఇది 180 హెచ్‌పీ పవర్ ఇస్తుంది. దీనికి 65 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ జతచేశారు. రెండవది 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ కాగా, ఇది 193 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 అలాగే 7 సీటర్ లేఅవుట్లలో లభిస్తుంది. కారు లోపల రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు, హెడ్-అప్ డిస్‌ప్లే, వెంటేటెడ్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్ పొందుపరిచారు. సేఫ్టీ కోసం 10 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవెల్ 2+ ఏడీఏఎస్ వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీని అందించారు.
సెల్టోస్ హవా
కేవలం సెప్టెంబర్ నెలలోనే కాకుండా 2027 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (H1 FY27) కూడా కియా ఇండియా అద్భుతమైన ప్రగతి సాధించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో కంపెనీ మొత్తం 1,68,683 కార్లను విక్రయించి గత ఏడాదితో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇందులో కియా సెల్తోస్ 67,667 యూనిట్ల సేల్స్‌తో కంపెనీ టాప్ సెల్లింగ్ కారుగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే సెల్తోస్ విక్రయాలు 99 శాతం పెరగడం విశేషం. కియా సోనెట్ 56,929 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.