Kia Seltos : త్వరలో కియా సెల్టోస్ హైబ్రిడ్ వేరియంట్ లాంచ్.. మైలేజ్ లో ఇక దీనిదే హవా
మైలేజ్ లో ఇక దీనిదే హవా
Kia Seltos : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUVలలో ఒకటైన కియా సెల్టోస్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఇప్పటికే సెకండ్ జనరేషన్ మోడల్‌తో దూసుకుపోతున్న ఈ కారులో ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్‌ను తీసుకురావడానికి కియా మోటార్స్ సిద్ధమైంది. కియా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించినప్పటికీ, లాంచ్ తేదీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, తాజా మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ హైబ్రిడ్ సెల్టోస్ 2027 నాటికి మన రోడ్ల పైకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా 2026 మధ్యలో అమెరికాలో మొదట ఈ కారు కనిపించనుంది.
విదేశాల్లో అమ్మే కియా సెల్టోస్ హైబ్రిడ్‌లో 1.6 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. కానీ, భారత పరిస్థితులకు తగ్గట్లుగా ఇక్కడ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్లను జత చేసే అవకాశం ఉంది. బ్యాటరీ ప్యాక్, ఇన్వర్టర్ వంటి ప్రధాన భాగాలను ఇండియాలోనే తయారు చేయడం ద్వారా కారు ధరను అందుబాటులో ఉంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ వల్ల కారు మైలేజ్ భారీగా పెరుగుతుంది, ఇది పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి మంచి వరం కానుంది.
పోటీ ఎవరితో అంటే?
కియా సెల్టోస్ హైబ్రిడ్ మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం సెగ్మెంట్ లీడర్లుగా ఉన్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్, టయోటా హైరైడర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో రాబోయే రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్, హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ మోడళ్లతో కూడా ఇది తలపడాల్సి ఉంటుంది. ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో కియా మళ్ళీ మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది.
ఫ్యామిలీల కోసం సరికొత్త 7-సీటర్ SUV
కేవలం సెల్టోస్ మాత్రమే కాదు, కియా ఇండియా మరో భారీ స్కెచ్ కూడా వేసింది. గ్లోబల్ మార్కెట్లో పాపులర్ అయిన కియా సోరెంటో ఆధారంగా ఒక కొత్త 7-సీటర్ SUVని ఇండియా కోసం తయారు చేస్తోంది. దీనికి MQ4i అనే కోడ్ నేమ్ ఇచ్చారు. ఇది చూడటానికి చాలా పొడవుగా, వెడల్పుగా ఉండి రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. సోరెంటో డిజైన్, ఫీచర్లను ఈ కారులో వాడబోతున్నారు. పెద్ద కుటుంబాలకు, లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక కానుంది.