Range Rover : ప్రసిద్ధ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లోకి తన అత్యంత లగ్జరీ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ ఎస్‌వి ఆల్ట్రాని అధికారికంగా ప్రవేశపెట్టింది. కంపెనీ లైనప్‌లోనే ఇది మోస్ట్ అడ్వాన్స్‌డ్, టాప్-స్పెసిఫికేషన్ వేరియంట్‌గా నిలిచింది. ఈ రాయల్ ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ. 3.8 కోట్లుగా నిర్ణయించారు. ప్రత్యేకమైన గుర్తింపు, అత్యున్నత స్థాయి కంఫర్ట్‌ను కోరుకునే విలాసవంతమైన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ కార్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

రాచరికపు ఎక్స్‌టీరియర్, డిజైన్ వివరాలు

రేంజ్ రోవర్ ఎస్‌వి ఆల్ట్రా ప్రత్యేకమైన టైటానియం సిల్వర్ పెయింట్ ఆప్షన్‌తో వస్తుంది. కారు బాడీపై సాటిన్ ప్లాటినం, సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన ట్రిమ్ పార్ట్స్ ఉన్నాయి. రేంజ్ రోవర్ బ్యాడ్జ్, గ్రిల్ చుట్టూ ఉన్న డిజైన్, స్కిడ్ ప్లేట్లు, వీల్ ఇన్సర్ట్‌లు సరికొత్త లుక్‌ను ఇస్తాయి. ఇందులో ప్రత్యేకమైన 22-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించగా, వీటికి ఇన్వర్టెడ్ R రేంజ్ రోవర్ లోగో ఉంటుంది. కస్టమర్లు కావాలనుకుంటే 23-అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్‌ను కూడా ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు.

ఇంటీరియర్ లగ్జరీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ

కారు కేబిన్ లోపల ఆర్కిడ్ వైట్, సిండర్ గ్రే డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌ను ఇచ్చారు. రతన్ పామ్ వుడ్ వెనీర్, గ్లోస్ వైట్ సిరామిక్ ఫినిషింగ్ వల్ల కేబిన్ ఎంతో విలాసవంతంగా కనిపిస్తుంది. ఇందులో 13.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 13.7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వెనుక సీటు ప్రయాణికుల కోసం 13.1-అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు ఉన్నాయి. ఇవే కాకుండా హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, కేబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సౌండ్ సిస్టమ్

ఈ కారులో 21 థిన్-ఫిల్మ్ స్పీకర్లతో కూడిన సరికొత్త ఎలక్ట్రోస్టాటిక్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సీట్ హెడ్‌రెస్ట్‌లు, హెడ్‌లైనర్‌లలో ఉన్న ఈ స్పీకర్లు బాడీ అండ్ సోల్ హాప్టిక్ సిస్టమ్‌తో కలిసి కారులోనే థియేటర్ స్థాయి అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 4.4-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ V8 మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 540 హార్స్‌పవర్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ అన్ని చక్రాలకు అందుతుంది. ఈ కారు కేవలం 4.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 261 కిమీగా కంపెనీ పేర్కొంది.

Tags: