Mahindra : మహీంద్రా కార్ల ప్రియులకు షాక్.. ఏప్రిల్ 6 నుంచి భారీగా పెరగనున్న ధరలు
ఏప్రిల్ 6 నుంచి భారీగా పెరగనున్న ధరలు
Mahindra : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. తన పోర్ట్‌ఫోలియోలోని వివిధ కార్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ధరలు 2026 ఏప్రిల్ 6వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో మహీంద్రా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారిపై అదనపు భారం పడనుంది. ఇప్పటికే టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ వంటి కంపెనీలు ధరల పెంపును ప్రకటించగా, ఇప్పుడు మహీంద్రా కూడా అదే బాటలో నడవడం గమనార్హం.
మహీంద్రా ప్రకటించిన వివరాల ప్రకారం.. కార్ల ధరలు గరిష్టంగా 2.5 శాతం వరకు పెరగనున్నాయి. అయితే అన్ని మోడళ్లపై సగటు పెంపు సుమారు 1.6 శాతంగా ఉండబోతోంది. ప్రధానంగా కార్ల తయారీకి అవసరమయ్యే ముడిసరుకుల ధరలు పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. పెట్రోల్, డీజిల్, కమర్షియల్ వాహనాలన్నింటికీ ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. గత ఏడాది మార్చిలో కూడా కంపెనీ సుమారు 3 శాతం వరకు ధరలను పెంచింది, మళ్ళీ ఏడాది తిరగకుండానే మరోసారి పెంపు తప్పలేదు.
అయితే, కొత్తగా లాంచ్ అయిన మహీంద్రా XUV7XO కస్టమర్లకు మాత్రం కంపెనీ ఒక తీపి కబురు అందించింది. ఈ ధరల పెంపు ప్రభావం XUV7XO పై వెంటనే ఉండదు. మొదటి 40,000 బుకింగ్‌ల వరకు పాత ధరలే కొనసాగుతాయి. ఈ 40,000 యూనిట్ల డెలివరీ పూర్తయిన తర్వాత మాత్రమే పెరిగిన ధరలు ఈ మోడల్‌కు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ కారు ధర రూ.13.66 లక్షల నుంచి రూ.25.07 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.
మరో విశేషమేమిటంటే, మహీంద్రా బోర్న్-ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ ధరల పెంపు ప్రభావం ఉండదు. మహీంద్రా విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు BE6, XEV 9e, XEV 9S పాత ధరలకే లభించనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. లాంచ్ అయిన ఏడాది లోపే 50,000 యూనిట్ల విక్రయాలను సాధించి మహీంద్రా రికార్డు సృష్టించింది. ఈ సక్సెస్‌తో భారత్‌లో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లు అమ్ముతున్న కంపెనీల జాబితాలో మహీంద్రా మూడవ స్థానానికి చేరుకుంది.