Mahindra Thar OG: కేవలం రూ.10.32 లక్షలకే కొత్త థార్ ఓజీ.. ఆ 8 మెకానికల్ మార్పులు ఏంటంటే?
ఆ 8 మెకానికల్ మార్పులు ఏంటంటే?
Mahindra Thar OG: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ఎస్‌యూవీలలో మహీంద్రా థార్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కంపెనీ తన పాపులర్ 3-డోర్ థార్‌కు అద్భుతమైన అప్‌డేట్స్ ఇచ్చి థార్ ఓజీ పేరుతో సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.10.32 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. చూడటానికి ఇది పాత థార్‌లాగే కనిపించినప్పటికీ దీని లోపల, మెకానికల్ పరంగా ఎన్నో భారీ మార్పులు చేశారు. LXT, AXT, ZXT అనే మూడు వేరియంట్లలో లభించే ఈ కొత్త థార్ డెలివరీలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి.
కొత్త ఎం-గ్లైడ్ ప్లాట్‌ఫామ్, అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్
ఈ కొత్త థార్ ఓజీని మహీంద్రాకు చెందిన అత్యాధునిక M_Glyde 4G ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. దీనివల్ల కారు రోడ్డుపై చాలా పటిష్టంగా ఉండటమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడంలో మరింత సులభంగా ఉంటుంది. అలాగే ఇందులో వెనుక వైపు కొత్త Penta-link సస్పెన్షన్‌తో పాటు Watts Linkను అమర్చారు. దీనివల్ల బాడు రాళ్లపై లేదా గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది.
డావిన్సి డ్యామింగ్, పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు
ఈ ఎస్‌యూవీలో ప్రత్యేకమైన DAVINCI Damping Technologyని జోడించారు. రోడ్డు పరిస్థితిని బట్టి సెన్సార్లు లేకుండానే ఇది తనకై తానుగా సస్పెన్షన్ సెటప్‌ను మార్చుకుంటుంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో మూడు రకాల ఆప్షన్లు ఉన్నాయి. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇప్పుడు 160 bhp పవర్‌ను, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 150 bhp పవర్‌ను ఇస్తాయి. అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తమ అవసరానికి తగినట్లుగా రియర్-వీల్ డ్రైవ్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
మొదటిసారిగా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్
థార్ చరిత్రలో తొలిసారిగా ఇందులో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ను అందించారు. దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో లేదా ఇరుకైన ప్రదేశాలలో కారును తిప్పడం చాలా సులభం అవుతుంది. అలాగే భద్రత కోసం ముందు, వెనుక కూర్చునే ప్రయాణికులందరికీ కలిపి మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్, టాప్ వేరియంట్లలో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్-వ్యూ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
కొత్త డ్రైవ్ మోడ్స్, 19-ఇంచ్ భారీ వీల్స్
ఆఫ్‌రోడింగ్ ప్రియుల కోసం ఇందులో ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్నో, శాండ్, మడ్ వంటి ప్రత్యేక టెరెన్ మోడ్స్‌తో పాటు జిప్, జూమ్ డ్రైవ్ మోడ్స్ కూడా లభిస్తాయి. ఇక లుక్ పరంగా మరింత స్టైలిష్‌గా ఉండేందుకు ఇందులో సరికొత్త డిజైన్ గ్రిల్, బంపర్లు ఇచ్చారు. ముఖ్యంగా టాప్ వేరియంట్లలో ఏకంగా 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. ఇప్పటివరకు వచ్చిన ఏ థార్‌లోనూ లేని అతిపెద్ద వీల్స్ ఇవే కావడం విశేషం.