Mahindra Thar : 3-డోర్ థార్ కొంటే లాభమా? 5-డోర్ల థార్ రాక్స్ కొంటే లాభమా?
5-డోర్ల థార్ రాక్స్ కొంటే లాభమా?
Mahindra Thar : మహీంద్రా థార్ అంటేనే దేశంలో ఒక ఐకానిక్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా గుర్తింపు ఉంది. స్ట్రాంగ్ లుక్, దుమ్మురేపే పర్ఫార్మెన్స్‌తో ఇది కచ్చా రోడ్ల మీద కూడా దూసుకుపోతుంది. ఈ మూడు డోర్ల థార్‌కి తోడుగా, మహీంద్రా ఇప్పుడు మరింత ప్రాక్టికల్‌గా, పెద్దగా ఉండే ఐదు-డోర్ల వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. దీనికి మహీంద్రా థార్ రాక్స్ అని పేరు పెట్టారు. థార్, థార్ రాక్స్ ఒకే పేరుతో ఉన్నప్పటికీ, అవి వేర్వేరు కస్టమర్ల అవసరాల కోసం రూపొందించారు. ఈ రెండింటిలో ఏది కొంటే లాభమో వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా థార్, థార్ రాక్స్ ఒకే కుటుంబానికి చెందినవి అయినప్పటికీ అవి రెండు వేర్వేరు లక్ష్యాలతో మార్కెట్‌లో ఉన్నాయి. 3-డోర్ థార్ ప్రధానంగా ఆఫ్-రోడింగ్ ఇష్టపడేవారికి, వ్యక్తిగత వినియోగానికి, అడ్వెంచర్ కోసం చూసే కస్టమర్ల కోసం రూపొందించారు. 5-డోర్ థార్ రాక్స్ మోడల్ కుటుంబ అవసరాలు ఉన్న వినియోగదారుల కోసం మరింత ప్రాక్టికల్‌గా, సౌకర్యవంతంగా తయారు చేశారు.
థార్ రాక్స్ తన చిన్న వెర్షన్ థార్ కంటే కొలతల్లో పెద్దదిగా ఉంటుంది. థార్ రాక్స్, 3-డోర్ థార్ కంటే 443 మిల్లీమీటర్లు పొడవు, 50 మిల్లీమీటర్లు వెడల్పు, 68 మిల్లీమీటర్లు ఎత్తు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, దీని వీల్‌బేస్ 400 మిల్లీమీటర్లు అధికంగా ఉండటం వలన లోపల ప్రయాణీకులకు ఎక్కువ స్థలం లభిస్తుంది. అయితే, రెండు కార్ల గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 226 మిల్లీమీటర్లు ఉంది.
థార్ రాక్స్, 3-డోర్ల థార్‌లో లేని అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లతో వచ్చింది. ఈ ఫీచర్ల కారణంగానే ఫ్యామిలీ యూజర్లకు ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. థార్ రాక్స్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా,ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.
రెండు మోడళ్లలోనూ 4x4 డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నప్పటికీ, థార్ రాక్స్‌లో వివిధ రకాల అవసరాల కోసం ప్రత్యేక డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. రెండు మోడళ్లు కూడా దాదాపు ఒకే విధమైన పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉన్నా, ధరల విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. 3-డోర్ థార్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, మరింత పవర్ఫుల్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
5-డోర్ థార్ రాక్స్‌లో కేవలం 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి (1.5-లీటర్ డీజిల్ ఆప్షన్ లేదు). మహీంద్రా థార్ (3-డోర్) ధర రూ.9.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల మధ్య ఉంది. మహీంద్రా థార్ రాక్స్ ధర రూ.12.25 లక్షల నుంచి రూ.22.06 లక్షల వరకు ఉంటుంది. అదనపు ఫీచర్లు, పెద్ద సైజు కారణంగా థార్ రాక్స్, 3-డోర్ల థార్ కంటే ఖరీదైనదిగా ఉంది.