Mahindra XEV 9e: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి గుడ్ న్యూస్..సరికొత్త అవతారంలో మహీంద్రా XEV 9e
| మహీంద్రా XEV 9e
Mahindra XEV 9e: 2026 ఏడాది ముగిసేలోపు కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మహీంద్రా కంపెనీ నుంచి రాబోతున్న కొత్త కారు మీ మనసు దోచుకోవడం ఖాయం. కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ కూపే-ఎస్యూవీ మహీంద్రా XEV 9eలో కొత్తగా స్పార్టెక్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. 2024 నవంబర్‌లో పరిచయమైన ఈ కారుకు రెండేళ్ల తర్వాత సరికొత్త అప్డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల BE 6 కారులో స్పార్టెక్ ఎడిషన్ తెచ్చిన మహీంద్రా, ఇప్పుడు XEV 9e ని కూడా అదే తరహాలో మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దింది. ఈ కొత్త ఎడిషన్ 2026 డిసెంబర్ 8న భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది.
డిజైన్, క్యాబిన్లో కొత్త మార్పులు ఇవే..
మహీంద్రా XEV 9e తన కూపే-ఎస్యూవీ డిజైన్ కారణంగా ఇప్పటికే రోడ్డుపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొత్త స్పార్టెక్ ఎడిషన్‌లో బాడీ షేప్ పాత మోడల్ లాగే ఉన్నప్పటికీ, కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. టాప్ వేరియంట్లో కొత్తగా 20-అంగుళాల భారీ అలాయ్ వీల్స్, వెనుక భాగంలో Sporteq బ్యాడ్జింగ్ కనిపించనున్నాయి. దీనికి తోడు కొత్త కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ జోడించనుంది. కారు లోపల క్యాబిన్లో సినీలక్స్ ఎడిషన్ తరహాలో ట్యాన్, బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో కూడిన డ్యూయల్-టోన్ ఇంటీరియర్ ఉండే అవకాశం ఉంది.
గూగుల్ జెమినీ AI, అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు
కొత్త XEV 9e స్పార్టెక్లో అతిపెద్ద మార్పు టెక్నాలజీ విభాగంలో ఉండబోతోంది. ఇందులో మహీంద్రా MAIA AI సిస్టమ్‌తో పాటు ఆరు రకాల TEQ ఫీచర్ ప్యాకేజీలను అందించనున్నారు. వీటి ద్వారా కారులో గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్, NFC కార్డ్, డిజిటల్ కార్ కీ, కస్టమైజ్డ్ డ్రైవర్ ప్రొఫైల్స్, అదనపు డ్రైవింగ్ మోడ్స్ లభిస్తాయి. అంతేకాకుండా వెనుక ఎల్ఈడీ లైట్లపై మనకు నచ్చిన టెక్స్ట్ డిస్ప్లే చేసుకునే సౌకర్యం, కారులోనే వీడియో గేమ్స్ ఆడుకునే సదుపాయం, కరోకే వంటి సరదా ఫీచర్లు కూడా రానున్నాయి. వీటితో పాటు మూడు 12.3-అంగుళాల స్క్రీన్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ప్రీమియం ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయి.
కొత్తగా 70 kWh బ్యాటరీ ఆప్షన్ వచ్చే ఛాన్స్
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా XEV 9e కారు 59 kWh, 79 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తోంది. అయితే కొత్త స్పార్టెక్ ఎడిషన్‌లో కంపెనీ మూడో ఆప్షన్‌గా 70 kWh బ్యాటరీ ప్యాక్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ బ్యాటరీని మహీంద్రా XEV 9S నుంచి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత మోడల్ 180 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీని 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
అంచనా ధర, పోటీ కార్లు ఇవే..
ప్రస్తుతం మహీంద్రా XEV 9e ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.21.90 లక్షలుగా ఉంది. కొత్త స్పార్టెక్ ఎడిషన్‌లో అదనపు ఏఐ ఫీచర్లు, డిజైన్ అప్డేట్స్ ఉండటంతో దీని ధర రెగ్యులర్ మోడల్ కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఈ కారు BYD అట్టో 3, టాటా హారియర్ ఈవీ, మహీ్ంద్రా XEV 9S, BE 6 మోడళ్లతో పాటు త్వరలో రాబోతున్న టాటా సఫారీ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.