Vehicle Insurance: మీ దగ్గర కారు లేదా బైక్ ఉందా? అయితే రానున్న రోజుల్లో వెహికల్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి రావొచ్చు. మీరు పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు బండికి ఇన్సూరెన్స్ గడువు ముగిసిందని తెలిస్తే అసలు పెట్రోల్, డీజిల్ పోయకుండా ఆపేసే రోజులు రాబోతున్నాయి. రోడ్లపై బీమా లేకుండా తిరుగుతున్న వాహనాల సంఖ్యను తగ్గించడానికి, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం వాహన బీమా నిబంధనల్లో భారీ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి.

ట్రాఫిక్ చలాన్లు ఎక్కువైతే బీమా ప్రీమియం పెంపు

ప్రభుత్వం పరిశీలిస్తున్న మరో కీలక మార్పు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి జేబులకు చిల్లు పెట్టేలా ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించేటప్పుడు గడిచిన ఏడాది కాలంలో ఆ వాహనంపై ఎన్ని ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయో లెక్కలోకి తీసుకుంటాయి. అంటే మీరు తరచూ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే, తర్వాతి ఏడాది ఇన్సూరెన్స్ రెన్యువల్ సమయంలో ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అదే నిబంధనలు సక్రమంగా పాటించేవారికి తక్కువ ప్రీమియం పడుతుంది. ఏ తప్పుకు ఎంత పెంచాలనే దానిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.

కారుకు 4 ఏళ్లు, బైక్‌కు 6 ఏళ్ల దీర్ఘకాలిక పాలసీలు

ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకునే తలనొప్పి నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. ఇందులో భాగంగా కార్లకు 4 సంవత్సరాలు, టూ-వీలర్లకు 6 సంవత్సరాల కాలపరిమితితో కూడిన దీర్ఘకాలిక ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకురావాలని ప్రతిపాదించింది. ఒకేసారి ప్రీమియం కట్టేస్తే ఏళ్ల తరబడి రెన్యువల్ బాధ ఉండదు, బీమా గడువు ముగిసిపోతుందనే భయమూ తగ్గుతుంది. దీనితో పాటు ఎలక్ట్రిక్ వాహనాలతో సహా కొన్ని ప్రత్యేక కేటగిరీల బేస్ ప్రీమియంలను కూడా సమీక్షిస్తున్నారు.

పెట్రోల్ బంకుల్లో ANPR కెమెరాలతో తనిఖీలు

బీమా లేని వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదనే ప్రతిపాదనపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ విధానంపై పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ కేంద్ర రవాణా, పెట్రోలియం శాఖలను కోరింది. తొలుత హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 5 చొప్పున పెట్రోల్ బంకుల్లో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ బంకుల్లో ఏర్పాటు చేసే ANPR కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, దానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉందో లేదో క్షణాల్లో గుర్తిస్తాయి. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలైతే బీమా లేని వాహనాలకు చుక్కలు తప్పవు.

కోట్లాది వాహనాలకు బీమా లేదు

దేశంలో ప్రస్తుతం సుమారు 25 కోట్ల యాక్టివ్ వాహనాలకు మాత్రమే (మొత్తం వాహనాల్లో 81 శాతం) చెల్లుబాటు అయ్యే బీమా ఉంది. భారీ వాణిజ్య వాహనాల్లో 90 శాతం, కార్లలో 88 శాతం, టూ-వీలర్లలో 80 శాతం, త్రీ-వీలర్లలో కేవలం 57 శాతం వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. అంటే ఇంకా కోట్లాది వాహనాలు బీమా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. మోటార్ వాహన చట్టం ప్రకారం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు సరైన పరిహారం అందాలంటే ప్రతి వాహనానికి బీమా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా సూచించింది. అందుకే ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలు తెచ్చేందుకు యోచిస్తోంది.

Tags: