Mahindra XEV 9S : మొబైల్ పవర్ స్టేషన్‌గా మారే కారు.. మహీంద్రా XEV 9S లాంచ్ ఎప్పుడంటే?

మహీంద్రా XEV 9S లాంచ్ ఎప్పుడంటే?

Update: 2025-11-14 14:31 GMT

Mahindra XEV 9S : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. త్వరలో కంపెనీ నుంచి ఆల్-ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన XEV 9S లాంచ్ కానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఎంత లగ్జరీగా ఉండబోతుందో స్పష్టంగా తెలుస్తోంది. ఏకంగా 1,400W పవర్ ఉన్న హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, 500 కి.మీ రేంజ్ వంటి ఫీచర్లతో వస్తున్న ఈ కారు గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహీంద్రా XEV 9S గ్లోబల్ డెబ్యూ నవంబర్ 27న బెంగళూరులో జరగనున్న Scream Electric ఈవెంట్‌లో ఉంటుంది.ఇది మహీంద్రా నుంచి వస్తున్న మొదటి 3-రో ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. కారును తేలికైన, స్ట్రాంగ్, INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. XEV 9S లగ్జరీ మరియు కంఫర్ట్ విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది.

ఇందులో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏంటంటే హార్మన్ కార్డన్ కంపెనీకి చెందిన 1,400W పవర్ ఉన్న 16-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్. ఇది డాల్బీ అట్మాస్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈ తరహా ఆడియో సిస్టమ్ సాధారణంగా లగ్జరీ బ్రాండ్ కార్లలోనే కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో ఉన్న ట్రిపుల్ డిజిటల్ డిస్‌ప్లే సెటప్ ఈ ఎస్‌యూవీకి పూర్తిగా ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తుంది. దాదాపు రూఫ్ మొత్తాన్ని కవర్ చేసే పానోరమిక్ సన్‌రూఫ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, మినిమలిస్ట్ గేర్ సెలెక్టర్ వంటివి కూడా ఉన్నాయి.

డిజైన్‌తో పాటు, ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ (వేడి చేసే), వెంటిలేటెడ్ సీట్లు, మెమరీ ఫంక్షన్ ఉన్న సీట్లు, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, యాంబియెంట్ లైటింగ్ వంటి ప్రీమియం సౌకర్యాలు లభించే అవకాశం ఉంది.సేఫ్టీ కోసం Level-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా, స్మార్ట్ డ్రైవింగ్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉండవచ్చని అంచనా.

XEV 9S లో మహీంద్రా BE.6, XEV 9e మోడల్స్‌లో ఉపయోగించే కొత్త బ్యాటరీ, మోటార్ టెక్నాలజీని వాడతారు. ఈ ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కి.మీ రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఇది అల్ట్రా-ఫాస్ట్ డీసీ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ ఏమిటంటే..ఇందులో బై-డైరెక్షనల్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. దీనివల్ల, ఈ కారును మొబైల్ పవర్ స్టేషన్‌లా ఉపయోగించి, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా ఛార్జ్ చేయవచ్చు.

Tags:    

Similar News