Mahindra XUV 3XO: రోడ్లపై దూసుకుపోతున్న మహీంద్రా ఎక్స్ఓవీ 3ఎక్స్ఓ.. రికార్డు స్థాయిలో అమ్ముడైన 2.5 లక్షల కార్లు
రికార్డు స్థాయిలో అమ్ముడైన 2.5 లక్షల కార్లు
Mahindra XUV 3XO: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తెచ్చిన కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్ఓవీ 3ఎక్స్ఓ అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండన్నర సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ కారు ఏకంగా 2.5 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని విజయవంతంగా దాటేసింది. మహీంద్రా చరిత్రలో ఇంత తక్కువ కాలంలో ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీగా ఇది రికార్డు సృష్టించింది.
ఈ ఎస్‌యూవీ విజయానికి ప్రధాన కారణం దీని ఆకర్షణీయమైన డిజైన్, మోడర్న్ లుక్ అని చెప్పవచ్చు. కారు ముందు భాగంలో కొత్త గ్రిల్, ఆకర్షణీయమైన సి-షేప్ డీఆర్‌ఎల్‌లు, ఎల్ఈడీ హెడ్‌లైట్లు దీనికి ప్రత్యేక అందాన్ని తెచ్చిపెట్టాయి. అలాగే వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఇవ్వడం ద్వారా మరింత స్టైలిష్ లుక్‌ను అందించారు. కేవలం బయటి రూపమే కాకుండా లోపలి ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా ఉంది. ఇందులో 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, విశాలమైన పనరామిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి.
సేఫ్టీ విషయంలోనూ ఈ కారుకు ఏమాత్రం తీసిపోదు. భారత్ ఎన్‌క్యాప్ నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ ఎస్‌యూవీలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అందించారు. అంతేకాకుండా ఉన్నత శ్రేణి వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ఏడీఏఎస్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కుటుంబంతో సురక్షితమైన ప్రయాణం కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.
ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఇందులో రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్లు, ఒక పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లభిస్తున్నాయి. పెట్రోల్ మోడల్స్ దాదాపు 18 నుండి 20 కి.మీ, అలాగే డీజిల్ మోడల్ దాదాపు 20 నుంచి 21.2 కి.మీ వరకు మైలేజ్ ఇస్తాయని అంచనా. ఇక ధర విషయానికి వస్తే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.7.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ.15.04 లక్షల వరకు ఉంటుంది. అద్భుతమైన ఫీచర్లు, పటిష్టమైన భద్రత, సరసమైన ధర కారణంగానే ఈ ఎస్‌యూవీకి మార్కెట్లో ఇంతటి ఆదరణ లభిస్తోందని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.