Mahindra : మళ్ళీ టాప్ గేర్ వేసిన మహీంద్రా.. సరికొత్త బోర్న్ ఎలక్ట్రిక్ కారుతో మార్కెట్ షేక్
సరికొత్త బోర్న్ ఎలక్ట్రిక్ కారుతో మార్కెట్ షేక్
Mahindra : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారీ స్కెచ్ వేసింది. తన ప్రతిష్టాత్మక బోర్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌లో భాగంగా సరికొత్త ఎస్‌యూవీని 2027లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం B07 అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్న ఈ కారు, 2022లో ప్రదర్శించిన BE.07 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతోంది. అప్పట్లో మహీంద్రా మొత్తం ఐదు ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌లను (XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09) పరిచయం చేయగా, వాటిలో ఇప్పటికే మూడు మోడళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన మోడళ్ల విషయానికి వస్తే.. BE.05 కాన్సెప్ట్ BE6 పేరుతో, XUV.e8 XEV 9Sగా, XUV.e9 XEV 9eగా రోడ్లపైకి వచ్చాయి. వీటి పర్ఫార్మెన్స్ అదిరిపోవడమే కాకుండా అమ్మకాల్లోనూ దూసుకుపోతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే BE6, XEV 9e మోడళ్లు కలిపి ఏకంగా 41,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయంటే మహీంద్రా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాబోయే B07 మోడల్ ఈ అమ్మకాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని కంపెనీ గట్టిగా నమ్ముతోంది.
సాంకేతికపరంగా ఈ కారు మహీంద్రా సొంత INGLO ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమవుతోంది. ఇది అత్యాధునిక బ్యాటరీ ప్యాక్, పవర్‌ఫుల్ మోటార్, స్మార్ట్ సాఫ్ట్‌వేర్‌కు సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా చూస్తే, ఇది BE6 కంటే కాస్త పెద్దదిగా, చూడటానికి మరింత బలంగా ఉండబోతోంది. దాదాపు 4.5 మీటర్ల పొడవుతో వచ్చే ఈ ఎస్‌యూవీలో C-షేప్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీకి దిగనుంది.
కారు ఇంటీరియర్ అత్యంత విలాసవంతంగా, భవిష్యత్ టెక్నాలజీతో ఉండబోతోంది. కాన్సెప్ట్ మోడల్‌లో చూపినట్లుగా డ్యాష్‌బోర్డ్ మీద మూడు భారీ స్క్రీన్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఫిజికల్ బటన్ల అవసరం లేకుండా టచ్ కంట్రోల్స్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు సామాన్యులను సైతం మెప్పించనున్నాయి. 2027 నాటికి మహీంద్రా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఈ B07 ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.